HYDRAA Park Protection | రూ.20 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

మేడ్చ‌ల్​లోని శ్రీ నిలయ రెసిడెన్సీలో పార్కు స్థలాన్ని ఆక్రమణల నుంచి హైడ్రా కాపాడింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA Park Protection | హైడ్రా (Hydraa) శ‌నివారం మ‌రో పార్కును కాపాడింది. లే ఔట్ వేసిన‌ప్పుడు పార్కుగా చూపించి.. త‌ర్వాత ప్లాట్లుగా మార్చేస్తున్న వైనాన్ని అడ్డుకుంది.

మేడ్చ‌ల్ (Medchal) గ్రామంలోని సర్వే నంబర్ 873, 882లో 13.31 ఎక‌రాల మేర 256 ప్లాట్ల‌తో సాయి శ్రీ నిలయ పేరిట 2000 సంవ‌త్స‌రంలో లే ఔట్ వేశారు. ప్లాట్ నంబర్లు 111, 112, 113, 114, 115, 116 కలిపి మొత్తం 1,970 చదరపు గజాల విస్తీర్ణం పార్కు కోసం కేటాయించారు. ఇందులోని సుమారు 400 చదరపు గజాల స్థలాన్ని కొందరు ఆక్రమించి, ప్లాట్లుగా విభజించి, ప్రీకాస్ట్ కాంక్రీట్ బ్లాకులతో ప్రహరీ నిర్మించార‌ని సాయి శ్రీ నిల‌య రెసిడెన్సీ వెల్ఫేర్ సొసైటీ ప్ర‌తినిధులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు.

HYDRAA Park Protection | ప్రహరీల తొలగింపు

క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన హైడ్రా అది పార్క్​ స్థలంగా నిర్ధారించింది. ఈ మేరకు పార్కు స్థ‌లంలో ప్రీకాస్ట్ కాంక్రీట్ బ్లాకుల‌తో నిర్మించిన ప్ర‌హ‌రీల‌ను శనివారం తొల‌గించింది. పార్కు హ‌ద్దుల‌ను నిర్ధారించింది. పార్కు స్థ‌లం చుట్టూ ఫెన్సింగ్ వేసింది. శ‌నివారం హైడ్రా కాపాడిన పార్కు స్థ‌లం విలువ రూ. 20 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా. పార్కును కాపాడిన హైడ్రాకు కాల‌నీ నివాసితులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

దీనిని కూడా చదవండి : Bus Stand Theft Gang | కుటుంబం అంతా కలిసి చోరీలు.. ముఠా ఆట కట్టించిన పోలీసులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.