అక్షరటుడే వెబ్‌డెస్క్: Indiramma Sewing Machines | బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు , కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకానికి శ్రీకారం చుట్టింది. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివారయంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలన ప్రభుత్వంలో బీసీ మహిళల స్వయం ఉపాధికి, ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. మహిళలను కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా, సొంతంగా ఉపాధి పొందే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
Indiramma Sewing Machines | 1.19 లక్షల మంది మహిళలకు ..
రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నారు. ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ. 12,000 కాగా, లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా దీనిని పూర్తిస్థాయిలో 100 శాతం సబ్సిడీపై అందజేయనున్నారు. అర్హులైన బీసీ మహిళలు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కుట్టు వృత్తిపై ఆసక్తి ఉండి ఉపాధి కోరుకునే నిరుద్యోగ బీసీ మహిళలకు ఈ పథకం ద్వారా అవకాశం కల్పిస్తారు. ఇందులోనూ అత్యంత పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, అనాథలు, వికలాంగులు , కుట్టు వృత్తిలో ముందే అనుభవం ఉన్న మహిళలకు నిబంధనల ప్రకారం అగ్రతాంబూలం ఇస్తారు.
Indiramma Sewing Machines | పారదర్శక ఎంపిక..
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి జరుగుతుంది. అంతేకాకుండా, కుట్టు మిషన్ల వినియోగంపై మహిళలకు ప్రత్యేక శిక్షణను కూడా తప్పనిసరిగా అందిస్తారు. తొలి విడతలో 1.19 లక్షల మందికి అవకాశం కల్పిస్తుండగా, భవిష్యత్తులో ఈ పథకాన్ని మరింత విస్తరించి మరిన్ని ఎక్కువ మంది బీసీ మహిళలకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
Indiramma Sewing Machines | రాష్ట్ర ప్రభుత్వం అండ..
మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు , ఇతర స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. తాజాగా ప్రవేశపెట్టిన ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం ద్వారా బీసీ మహిళలు తమ ఇళ్ల వద్ద నుంచే ఉపాధి పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. అలాగే, బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఆత్మగౌరవ భవనాలకు నిధులను కేటాయించి వాటి నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఇటీవల బలహీన వర్గాల ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి బీసీల సమగ్ర అభివృద్ధికి ఒక నూతన కార్యాచరణను రూపొందించామని, కులగణన పూర్తయిన తర్వాత బీసీల అభివృద్ధికి సంబంధించిన తదుపరి చర్యలను మరింత వేగవంతం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
Indiramma Sewing Machines | మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ..
ఈనెల 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఘనంగా ఆవిష్కరించనున్నట్లు మంత్రి తెలిపారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, అందులో భాగంగానే మహాత్మా జ్యోతిబాపూలేను స్మరిస్తూ ప్రగతి భవన్‌ను “మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్” గా, సచివాలయాన్ని “డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం”గా పేరు మార్చామని గుర్తుచేశారు.
అలాగే, ఈనెల 18వ తేదీన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారని తెలిపారు. ఈ రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు , వివిధ కుల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకరయ్య, నవీన్ యాదవ్, కాలేరు వెంకటేష్, వివిధ కులాల కార్పొరేషన్ల చైర్మన్లు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాలమయాదేవి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు మల్లయ్య బట్టు, అలోక్ కుమార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’
119 నియోజకవర్గాల్లో 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీకి శ్రీకారం
ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ
100 శాతం సబ్సిడీపై ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ.12 వేలు
బీసీ మహిళల్లో ఉపాధి అవకాశాలు… pic.twitter.com/r8cGclM51R
— IPRDepartment (@IPRTelangana) August 13, 2026
ఇది కూడా చదవండి: Armoor Municipal Corruption | ఆర్మూర్ బల్దియాలో ‘మామూళ్ల’ పర్వం..