అక్షరటుడే, వెబ్డెస్క్ : BC Gurukul Inspection | రాష్ట్రంలోని అన్ని బీసీ గురుకుల విద్యా సంస్థలను ఆగస్టు 30లోగా పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, సురక్షిత వాతావరణం, మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
బీసీ గురుకుల విద్యాసంస్థల నిర్వహణపై మంగళవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గురుకుల విద్యాసంస్థల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యార్థులకు అత్యుత్తమ విద్యా వాతావరణాన్ని కల్పించేలా అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రతి రీజినల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ (RCO) వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కనీసం ఆరు గురుకుల విద్యాసంస్థలను సందర్శించాలని ఆదేశించారు. ఆర్సీవోలు కేవలం పర్యవేక్షణకే పరిమితం కాకుండా ప్రధాన కార్యాలయం, జిల్లా యంత్రాంగం, విద్యాసంస్థల మధ్య సమన్వయం కల్పించే సంధాన కర్తలుగా వ్యవహరించాలని సూచించారు.
BC Gurukul Inspection | భూములు సేకరించాలి
సొంత భవనాలు లేని గురుకుల విద్యాసంస్థల కోసం భూముల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం సంబంధిత కలెక్టర్లతో సమావేశమై అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఏ నియోజకవర్గానికి అనుమతి పొందిన విద్యాసంస్థ అదే నియోజకవర్గ పరిధిలో భవనాలను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అద్దె భవనాలకు చెల్లించే మొత్తంలో ఆరు శాతం నిధులను భవనాల మరమ్మతులకు తప్పనిసరిగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనుకాకుండా సైకాలజిస్ట్లతో అవగాహన సమావేశాలు నిర్వహించాలన్నారు.
BC Gurukul Inspection | ఆహార నాణ్యతపై..
ఎక్కడా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరగకుండా వంటశాలలు, ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రతి నెల కనీసం 15 గురుకుల విద్యాసంస్థలను తాను, కమిషనర్, కార్యదర్శి అకస్మిక తనిఖీలు చేస్తామని తెలిపారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని ఆయన హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. ఎలా అప్లై చేయాలంటే?