అక్షరటుడే, భీమ్‌గల్: Indiramma Towers Scheme | నగరంలో సొంత ఇల్లు లేని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంత గూడు సమకూర్చుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ‘ఇందిరమ్మ టవర్స్’ పథకంలో భాగంగా నిజామాబాద్ నగరంలోని నాగారం ఆర్‌జీకే కాలనీలో 480 ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Indiramma Towers Scheme | అర్హులైన కుటుంబాల నుంచి దరఖాస్తులు..
తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో అధికారులు అర్హులైన కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ పథకంపై ఆసక్తి చూపుతున్నవారు అర్హతలు, చెల్లింపుల వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. ఈ మేరకు ‘ఇందిరమ్మ టవర్స్’కు డిసెంబర్ 5లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సూచించారు.
Indiramma Towers Scheme | రూ.8.50 లక్షలతో ఫ్లాట్..
ఒక్కో ఫ్లాట్‌ను 512 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. దీని కోసం ప్రభుత్వం రూ.5 లక్షల రాయితీ అందించనుండగా, లబ్ధిదారుడు రూ.3.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా సమకూర్చనుంది. దీంతో సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్న నగర పేద కుటుంబాలకు కొంత ఊరట లభించనుంది.
Indiramma Towers Scheme | అర్హతలివే.. దరఖాస్తు ఇలా..
కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉండాలి. సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సొంత ఇల్లు లేదా స్థలం ఉండకూడదు. అర్హత కలిగిన వారు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ.100 కాగా, రూ.10 వేల టోకెన్ అడ్వాన్స్ చెల్లించాలి. దరఖాస్తుల స్వీకరణకు డిసెంబరు 5ను చివరి తేదీగా నిర్ణయించారు.
Indiramma Towers Scheme | పరిశీలన తర్వాతే కేటాయింపు
దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఫ్లాట్లు లభిస్తాయని భావించరాదని అధికారులు పేర్కొంటున్నారు. అర్హతలను పరిశీలించిన అనంతరం లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. క్షేత్రస్థాయిలో వివరాల ధ్రువీకరణ కూడా చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులు ఆదాయ ధ్రువీకరణ, నివాసం, కుటుంబ వివరాలకు సంబంధించిన పత్రాలను సిద్ధం చేసుకోవాలి. గడువులోగా దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు.
ఇది కూడా చదవండి..: Wild Boar Hunting | అడవి పందిని వేటాడి మాంసం విక్రయం.. ముగ్గురి అరెస్టు