అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jio Platforms IPO | రిలయన్స్ డిజిటల్, టెలికాం విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) ఐపీవో సబ్‌స్క్రిప్షన్ ఈనెల 21న ప్రారంభమై 23న ముగిసిన విషయం తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి సుమారు రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన ఈ ఐపీవో పలు రికార్డులు బద్దలు కొట్టింది.
రూ. 30,188 కోట్ల పబ్లిక్ ఇష్యూతో భారతదేశంలోనే అతిపెద్దదిగా నిలిచింది. దీనికి 13.8 మిలియన్లకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ బిడ్ల విలువ రూ. 4.72 లక్షల కోట్లు. అత్యంత వేగవంతంగా పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన మెగా ఐపీవోగా జియో ప్లాట్‌ఫామ్స్ నిలిచింది. ప్రపంచంలోనే కోటికి పైగా దరఖాస్తులను అందుకున్న మొదటి ఐపీవో కూడా ఇదే కావడం గమనార్హం. రిటైల్ మరియు సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి లభించిన బలమైన డిమాండ్‌తో స్టాక్ మార్కెట్ (Stock market)లో అరంగేట్రం చేయడానికి ముందే కంపెనీ విలువ రూ. 10.26 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. జియో ప్లాట్‌ఫామ్స్ రికార్డుల గురించి తెలుసుకుందామా..
Jio Platforms IPO | దేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీవో..
జియో ప్లాట్‌ఫామ్స్ రూ.30,188 కోట్ల ఇష్యూ పరిమాణంతో భారత స్టాక్ మార్కెట్‌లో అతిపెద్ద ఐపీవోగా నిలిచింది. ఇది అంతకుముందు హ్యుందాయ్ మోటార్ ఇండియా పేరిట ఉంది. ఆ కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ రూపంలో రూ. 27,870 కోట్లను సమీకరించింది. ఎనఎసఈ ఇండియా రూ. 22,561 కోట్లు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ. 21,008 కోట్లు సమీకరించాయి.
Jio Platforms IPO | అతిపెద్ద ఫ్రెష్ ఇష్యూ..
జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూ మొత్తం ఫ్రెష్ ఇష్యూ కావడం గమనార్హం. గరిష్టంగా 27 కోట్ల షేర్లను జారీ చేశారు. తద్వారా పూర్తిగా కొత్త షేర్లతో కూడిన అతిపెద్ద ఐపీవోగానూ ఇది ఆవిర్భవించింది.
Jio Platforms IPO | దరఖాస్తుల్లో వరల్డ్ రికార్డ్..
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవోకు 13.8 మిలియన్లకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యధికం. గతంలో ఈ రికార్డ్ వారీ ఎనర్జీస్ పేరిట ఉంది. ఆ సంస్థ ఐపీవోకు సుమారు 97.3 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
Jio Platforms IPO | రూ.4.72 లక్షల కోట్ల బిడ్లు..
ఈ ఇష్యూకు రూ. 4.72 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. యాంకర్ బుక్ కోసం వచ్చిన సుమారు రూ.2.5 లక్షల కోట్ల బిడ్లతో కలిపి జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవోకు మొత్తం డిమాండ్ దాదాపు రూ. 7.4 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ డిమాండ్ 2025లో వచ్చిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఐపీవోను అధిగమించింది.
Jio Platforms IPO | వంద నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్..
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో ఈనెల 21న ప్రారంభమై 23 న ముగిసింది. పబ్లిక్ ఇష్యూ ప్రారంభమైన తొలి 100 నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ కావడం గమనార్హం. ఈ ఇష్యూ మొదటి రోజే రూ. 67,117 కోట్ల విలువైన బిడ్లను ఆకర్షించింది.
Jio Platforms IPO | క్యూఐబీ బిడ్లు రూ.3.6 లక్షల కోట్లు..
జియో ప్లాట్‌ఫామ్స్ కంపెనీపై క్యూఐబీల విశ్వాసాన్ని చూపారు. అతిపెద్ద ఐపీవో అయినా.. భారీగా సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఇష్యూ ప్రారంభమైన నిమిషాల్లోనే క్యూఐబీ వాటా పూర్తిగా సబ్‌స్క్రైబ్ కావడం గమనార్హం. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ (క్యూఐబీ) వాటా 67.15 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. బిడ్ల విలువ రూ. 3.68 లక్షల కోట్లు దాటింది.
Jio Platforms IPO | ఎన్ ఐఐ కోటా 14 రెట్లు..
సంస్థాగతయేతర పెట్టుబడిదారులు ఆఫర్‌లో ఉన్న 3.64 కోట్ల షేర్లకు గాను 51.03 కోట్ల షేర్ల కోసం బిడ్లు వేశారు.ఈ కోటా 14 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయ్యింది.
Jio Platforms IPO | రిటైల్ కోటా 2.76 రెట్లు సబ్‌స్క్రైబ్..
ఈ ఇష్యూపై రిటైల్ ఇన్వెస్టర్లు కూడా బలమైన ఆసక్తిని కనబరిచారు. రిటైల్ కోటా 2.76 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఈ విభాగంలో మొత్తం 1.02 కోట్ల దరఖాస్తులు రావడం గమనార్హం.
Jio Platforms IPO | యాంకర్ బుక్‌కూ రికార్డు స్థాయిలో డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో యాంకర్ బుక్ సైతం రికార్డ్ నెలకొల్పింది. ఈ విభాగం 30 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయ్యింది. యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించిన సుమారు రూ. 8,110 కోట్ల విలువైన షేర్లకు రూ. 2.5 లక్షల కోట్లకు పైగా విలువైన బిడ్లు వచ్చాయి.
Jio Platforms IPO | కొత్తగా లిస్టయ్యే కంపెనీలలో అత్యధిక విలువ..
గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద జియో ఒక్కో షేరు ధర రూ. 1,119. ఐపీవో పూర్తిగా సబ్‌స్క్రైబ్ కావడంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 10.26 కోట్లుగా అంచనా వేస్తున్నారు. బుధవారం కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్‌లో లిస్టవనున్నాయి. ఆ సమయంలో ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా భారతదేశంలోని అతిపెద్ద కంపెనీలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. అంతేకాకుండా ట్రేడింగ్ ప్రారంభమైన మొదటి రోజే మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలోని టాప్ 5 లిస్టెడ్ కంపెనీలలో ఒకటిగా నిలవనుంది.
Jio Platforms IPO | బిడ్డింగ్ సమయం పొడిగింపు..
బీఎస్ ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో కోసం రోజువారీ బిడ్డింగ్ సమయాన్ని పొడిగించాయి. సాధారణంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బిడ్డింగ్ విండో అందుబాటులో ఉంటుంది. కానీ జియో ప్లాట్‌ఫామ్స్ కోసం ఎక్స్ఛేంజీలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పనిచేశాయి.
ఇది కూడా చదవండి..: Jio IPO | ‘జియో’ ఐపీవోకు భారీ స్పందన