అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy District | చిన్న జిల్లాలతో అభివృద్ధి వేగంగా జరుగుతుందని భావించిన గత ప్రభుత్వం 10 జిల్లాలున్న రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా మార్చింది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ప్రజలకు అర్థవంతమైన సేవలు అందించేందుకు 2016 లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డివిజన్‌గా ఉన్న కామారెడ్డిని నిజామాబాద్ నుంచి విడదీస్తూ కొత్త జిల్లాగా ప్రకటించింది.
Kamareddy District | 2016లో ప్రత్యేక జిల్లాగా..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad District) నుంచి కామారెడ్డి డివిజన్‌ను విడదీసి 2016 అక్టోబర్ 11న ప్రత్యేక జిల్లాగా ప్రకటించారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టుతో పాటు అన్ని జిల్లాస్థాయి కార్యాలయాలు కామారెడ్డికి వచ్చాయి. ఈనెల 11 నాటికి జిల్లా ఏర్పడి 9 ఏళ్లు పూర్తి చేసుకుని పదో ఏట అడుగుపెడుతోంది. ఈ క్రమంలో పదేళ్ల జిల్లా పాలనలో అభివృద్ధిపై ప్రత్యేక కథనాలు ‘అక్షరటుడే’ పాఠకుల కోసం..
Kamareddy District | అభివృద్ధిపై గంపెడాశలు..
జిల్లా ఏర్పాటుతో తమ తలరాత మారుతుందని ప్రజలు భావించారు. పరిశ్రమలు వస్తాయి, యువతకు ఉపాధి దొరుకుతుంది, మెరుగైన రోడ్లు, విద్య, వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆశపడ్డారు. చిన్న పనికైనా నిజామాబాద్ వెళ్లాల్సిన బాధ తప్పుతుందని సంతోషించారు. ఆ ఆశలతోనే జిల్లా ఏర్పాటును ఘనంగా స్వాగతించారు.
Kamareddy District | మారని పట్టణ స్థితిగతులు
పేరుకు జిల్లా కేంద్రమే అయినా కామారెడ్డి పట్టణ రూపురేఖలు మాత్రం మారలేదు. నగరంలోని అంతర్గత రోడ్లు గుంతలమయంగా ఉన్నాయి. చిన్నపాటి వర్షానికే ప్రధాన రహదారులు జలమయమవుతున్నాయి. వంద పడకల ఆస్పత్రిలో పడకల సంఖ్య పెరిగినా జిల్లా ఆస్పత్రిలో స్పెషలిస్ట్ వైద్యుల కొరత తీరలేదు. మెడికల్ కాలేజీ మంజూరైనా పూర్తి స్థాయి వసతులు అందుబాటులోకి రాలేదు. కొత్త బస్టాండ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రింగ్ రోడ్డు వంటి ప్రతిపాదనలు ఇంకా కాగితాలకే పరిమితమయ్యాయి.
Kamareddy District | వెక్కిరిస్తున్న సమస్యలు
తొమ్మిదేళ్లు గడిచినా సమస్యలు అలాగే వెక్కిరిస్తుండటంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వ్యవసాయ ఆధారిత జిల్లాలో కోల్డ్ స్టోరేజీలు, అనుకున్నంతగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రాక రైతులు నష్టపోతున్నారు. ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోవడంతో యువత ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి. ‘జిల్లా అయ్యింది కానీ కలెక్టర్ ఆఫీసు భవనం తప్ప కొత్తగా వచ్చింది ఏమీ లేదు’ అని స్థానికులు వేలెత్తి చూపుతున్నారు.
Kamareddy District | మెడికల్ కాలేజీ వచ్చినా వసతులు శూన్యం

జిల్లా ప్రజల చిరకాల కోరిక మెడికల్ కాలేజీ.. ఆ కోరిక నెరవేరి కాలేజీ మంజూరైనా, అందుకు తగ్గ వసతులు లేక విద్యార్థులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అధ్యాపకుల కొరత, ల్యాబ్ సౌకర్యాల లేమి, హాస్టల్ సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. జిల్లా ఆస్పత్రిని బోధనాసుపత్రిగా అప్డ్రేడ్ చేస్తామన్న హామీ నెరవేరలేదు. దీంతో సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం ఇప్పటికీ హైదరాబాద్, నిజామాబాద్ వెళ్లాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.
Kamareddy District | రాజకీయంగా కీలకం.. అభివృద్ధిలో వివక్ష..?
రాష్ట్ర రాజకీయాల్లో కామారెడ్డి జిల్లా ఎంతో కీలకం. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరూ ఇక్కడి నుంచే పోటీ చేసిన నేపథ్యంలో జిల్లా.. రాష్ట్రవ్యాప్తంగా ఫోకస్ అయ్యింది. అయినా ఆ స్థాయిలో నిధులు, ప్రాజెక్టులు రాలేదనే విమర్శ ఉంది. కాళేశ్వరం ప్యాకేజీలో భాగమైన ప్యాకేజీ 21, 22, 23 రిజర్వాయర్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి.పదేళ్ల ప్రస్థానంలో పాలన దగ్గరైనా, అభివృద్ధి మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిందనే చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి పెండింగ్ పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Narala Sudhakar Red Cross | నరాల సుధాకర్‌ను సన్మానించిన దిల్‌రాజు, శిరీష్ రెడ్డి