అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Municipal Meeting | కామారెడ్డి మున్సిపాలిటీ జనరల్ బాడీ సమావేశం గురువారం రసాభాసగా మారింది. ఎజెండాలోని అంశాలపై బీజేపీ (BJP) కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో వాగ్వాదం చోటుచేసుకుంది.
అవసరమైన అంశాలను పక్కన పెట్టి అవసరం లేని బిల్లులను ఎజెండాలో చేర్చారని బీజేపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి వార్డుకు రూ.5 లక్షలు కేటాయించిన నిర్ణయాన్ని మాత్రం వారు స్వాగతించారు. అదే సమయంలో మున్సిపల్ నిధులు దుర్వినియోగం కానివ్వబోమంటూ పోడియం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. పరిస్థితి అదుపు తప్పడంతో కమిషనర్ సమావేశాన్ని 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. విరామం అనంతరం తిరిగి ప్రారంభమైన సమావేశానికి బీజేపీ కౌన్సిలర్లు హాజరుకాలేదు. దీంతో సాయంత్రం సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు.
Kamareddy Municipal Meeting | ప్రజా సమస్యలు గాలికి..
కామారెడ్డి పట్టణ ప్రజల సమస్యలు గాలికి వదిలి బిల్లులు తెచ్చారని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు. మున్సిపల్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సమావేశానికి కొన్ని రోజుల ముందు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేశామని, అందులో ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ సమక్షంలో శానిటేషన్, రోడ్డు మరమ్మతులు, డ్రైనేజీ పనులు తప్ప మరే ఇతర బిల్లుల అంశాలు ఎజెండాలో ఉండకూడదని అందరి సమక్షంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే ఆ నిర్ణయాన్ని పక్కనపెట్టి ప్రజా సమస్యలను గాలికి వదిలి మళ్లీ అన్ని బిల్లులను ఎజెండాలో చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సమావేశంలో శానిటేషన్, చెత్త ట్రాక్టర్ల గురించి చర్చించాలని పట్టుబట్టామని చెప్పారు.
Kamareddy Municipal Meeting | బీజేపీ తీరుపై ఛైర్పర్సన్ ఆగ్రహం
తాను ఒక మహిళా ఛైర్పర్సన్ అని కూడా చూడకుండా బీజేపీ కౌన్సిలర్లు పోడియం ముట్టడి చేయడం సరికాదని ఇప్ప ఉమారాణి అన్నారు. సమావేశం అనంతరం కౌన్సిలర్లతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు.కామారెడ్డి పట్టణాభివృద్ధిని పట్టించుకోకుండా సర్వసభ్య సమావేశంలో దౌర్జన్యానికి దిగడమే బీజేపీ కౌన్సిలర్ల ధ్యేయమని విమర్శించారు. పట్టణ ప్రగతిని ధ్యేయంగా పెట్టుకుని పార్టీలకు అతీతంగా కామారెడ్డిలోని 49 వార్డులకు నిధులు కేటాయిస్తూ 35 అంశాలతో ప్రజానుకూల ఎజెండాను రూపొందించామని తెలిపారు. కానీ ఎజెండా ప్రారంభం కాకముందే బీజేపీ కౌన్సిలర్లు గాలి మాటలు మాట్లాడుతూ, ఎజెండా ప్రతులను చించివేసి, మైకులను విసిరేస్తూ తీవ్ర హంగామా సృష్టించారని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేస్తాం అని చెప్పుకునే బీజేపీ నాయకులు ప్రతి సమావేశాన్ని కావాలనే రసాభాస చేస్తూ అభివృద్ధికి మోకాలడ్డుతున్నారని ఆరోపించారు.
దీనిని కూడా చదవండి : CJP Protest | సీజేపీతో మరోసారి చర్చలకు సిద్ధం.. కేంద్రం కీలక ప్రకటన