అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indiramma Towers | హైదరాబాద్ నగరంలో సొంత ఇల్లు లేని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు గృహాలను అందుబాటు ధరలో అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, దరఖాస్తుల ప్రక్రియ, అమలు విధానంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ.. నిరుపేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే గృహాలు నిర్మించేందుకు నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకున్నామని తెలిపారు. నగరంలో విలువైన ప్రభుత్వ భూములను ప్రజల సంక్షేమానికి వినియోగిస్తూ, అర్హులైన కుటుంబాలకు శాశ్వత గృహ భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
Indiramma Towers | లబ్ధిదారుడి వాటా రూ.6 లక్షలు
ఇందిరమ్మ టవర్స్ ద్వారా నగరంలో సొంత ఇల్లు లేని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన గృహాలను అందుబాటు ధరలో అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారమే ఈ గృహాల నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. లబ్ధిదారులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. లబ్ధిదారుడి వాటా అన్ని ప్రాంతాల్లో రూ.6 లక్షలు మాత్రమే ఉంటుందని చెప్పారు. తొలి విడతలో ఎంపిక చేసిన 16 నియోజకవర్గాల్లో నిర్మించనున్న ఫ్లాట్ల మార్కెట్ విలువ సుమారు రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉండగా, ఎస్‌ఆర్‌వో (బేసిక్) విలువ రూ.14.6 లక్షల నుంచి రూ.28.4 లక్షల వరకు ఉందన్నారు.
Indiramma Towers | రిజర్వేషన్లు ఇలా..
తొలి విడతగా నిర్మించనున్న ఇందిరమ్మ గృహాల్లో ఎస్సీలకు 14 శాతం, ఎస్టీలకు 5 శాతం, బీసీలకు 16 శాతం, దివ్యాంగులకు 5 శాతం, ప్రభుత్వ అవుట్‌సోర్సింగ్, నాలుగో తరగతి ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు 10 శాతం చొప్పున రిజర్వేషన్ కల్పిస్తున్నామని తెలిపారు. ఇందులో 30 శాతం మహిళలకు కేటాయించనున్నట్లు వెల్లడించారు. మిగిలిన 50 శాతం గృహాలను జనరల్ కేటగిరీలో కేటాయిస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం సమీపంలోని మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దీనిని కూడా చదవండి : KTR Legal Notice | అవినీతిపై సిట్, సీఐడీ విచారణకు రేవంత్ రెడ్డి సిద్ధమా?: కేటీఆర్