KCR Jagtial Sabha | గులాబీ బాస్ ఆగమనం.. 20న జగిత్యాలలో బహిరంగ సభ.. బీఆర్ఎస్ కు పూర్వ వైభవం వచ్చేనా!

Naresh Chandan
KCR Jagtial Sabha

అక్షరటుడే, వెబ్​డెస్క్​: KCR Jagtial Sabha | తెలంగాణ రాజకీయాల్లో ఏప్రిల్ 20 ఒక కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదాపు రెండేళ్లుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు.. జగిత్యాల వేదికగా తిరిగి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఆయన పాల్గొంటున్న తొలి భారీ బహిరంగ సభ కావడంతో, కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? ఆయన తదుపరి వ్యూహం ఏమిటి? అనే అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.akshara today .jpgKCR 1

KCR Jagtial Sabha | కేసీఆర్ జగిత్యాల పర్యటన షెడ్యూల్:

‘ప్రజా ఆశీర్వాద సభ’ కోసం బీఆర్‌ఎస్ శ్రేణులు జగిత్యాలలో భారీ ఏర్పాట్లు చేశాయి. కేసీఆర్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.

సాయంత్రం 4:45 గంటలకు కేసీఆర్ ఎర్రవల్లి నివాసం నుంచి హెలికాప్టర్​లో జగిత్యాలకు బయలుదేరుతారు. జగిత్యాల కలెక్టరేట్ హెలిప్యాడ్‌ వద్ద దిగి, అక్కడి నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు.

సభకు ముందు పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులతో కేసీఆర్ సమావేశమై, తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై కీలక దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 6:00 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ లక్షలాదిగా తరలివచ్చే జనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

KCR Jagtial Sabha | పునరాగమనం వెనుక అసలు వ్యూహం:

ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ బహిరంగంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించలేదు. శాసనసభ సమావేశాలకు గైర్హాజరు కావడంతో కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలకు ఆయన తనదైన శైలిలో సమాధానం ఇవ్వబోతున్నారు.

జగిత్యాల సభ కేవలం ఒక రోజు కార్యక్రమం కాదు.. ఇది కేసీఆర్ రాజకీయ ‘సెకండ్ ఇన్నింగ్స్’కు లాంచ్ ప్యాడ్. పార్టీ శ్రేణుల్లో పునరుత్తేజం నింపడమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో తన ఉనికిని చాటడమే లక్ష్యంగా ఈ సభను నిర్వహిస్తున్నారు.

KCR Jagtial Sabha | ఆరు గ్యారెంటీలు – అమలు కాని హామీలపై నిశిత విమర్శలు:

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ‘ఆరు గ్యారెంటీలు’, ఇతర హామీల అమలులో జరుగుతున్న వైఫల్యాలను కేసీఆర్ ఈ సభలో ప్రధాన అస్త్రాలుగా చేసుకునే అవకాశం ఉంది.

మహాలక్ష్మి పథకం: మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి, రెండేళ్లవుతున్నా ఒక్క పైసా కూడా జమ చేయకపోవడంపై ఆయన అడిగే ఛాన్స్ ఉంది.

ఆసరా పింఛన్ల జాప్యం: పింఛన్లను రూ.4,000 కు పెంచుతామని చెప్పి, ఇంతవరకు పాత మొత్తాన్నే ఇస్తుండటంతో లబ్ధిదారుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ అంశంపై మాట్టాడే అవకాశం ఉంది.

రైతు భరోసా గందరగోళం: రైతులకు ఇస్తామన్న రూ.15,000 పెట్టుబడి సాయం సక్రమంగా అందకపోవడం, నిధులను విడతల వారీగా విడుదల చేస్తూ రైతులను ఇబ్బంది పెట్టడంపై కేసీఆర్ స్పందించవచ్చు.

ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి: రెండు లక్షల ఉద్యోగాల భర్తీ , నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి హామీలు కేవలం ఓట్ల కోసమేనా అని ప్రశ్నించే ఛాన్స్ ఉంది.

KCR Jagtial Sabha | జీవన్ రెడ్డి చేరిక: కాంగ్రెస్ కోటలో బీఆర్‌ఎస్ బాంబు

దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా ఉన్న సీనియర్ నాయకుడు టి. జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్ గూటికి చేరడం రాజకీయంగా పెను సంచలనం. 42 ఏళ్ల అనుబంధాన్ని వీడి ఆయన కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు.

వ్యూహాత్మక బలం: క్లీన్ ఇమేజ్ ఉన్న జీవన్ రెడ్డి చేరికతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్‌ఎస్ మరింత పటిష్టం కానుంది. కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు, తన ఆత్మగౌరవానికి భంగం కలగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించడం కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ.

ఇకపై నిరంతరం ప్రజల్లోనే.. సరికొత్త కార్యాచరణ:

ఈ సభతోనే కేసీఆర్ తన నిరంతర ప్రజా పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. “ఇకపై ఫామ్‌హౌస్‌కే పరిమితం కాకుండా, నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వరుస బహిరంగ సభలు నిర్వహించాలని” కేసీఆర్ నిర్ణయించుకున్నారు. జగిత్యాల నుంచి ప్రారంభమయ్యే ఈ పరంపర రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.akshara today .jpgrevanth

రేవంత్ రెడ్డి ‘మేడిగడ్డ’ వ్యూహం:

కేసీఆర్ సభకు దీటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే రోజు కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను ఎండగట్టడం ద్వారా కేసీఆర్ సభ మైలేజీని తగ్గించాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. కేసీఆర్ సభ మీడియా కవరేజీని మొత్తం ఆక్రమించుకోకుండా చూసేందుకే రేవంత్ తన పర్యటనను అదే రోజు షెడ్యూల్ చేశారని బీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Telangana Weather Update | దంచికొట్టిన వాన.. ఈ ప్రాంతాల్లో మరిన్ని వర్షాలు..

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *