అక్షరటుడే, హైదరాబాద్: Kodandaram Elections | తెలంగాణ రాజకీయాల్లో మార్పు, రాబోయే ఎన్నికల్లో తమ వ్యూహంపై తెలంగాణ జన సమితి (TJS) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో ఆయన గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, ప్రస్తుత ప్రభుత్వంతో తమకున్న సంబంధాలపై స్పష్టతనిచ్చారు.
Kodandaram Elections | పదవులపై క్లారిటీ
ప్రభుత్వంలో కోదండరాం (Kodandaram) పాత్రపై జరుగుతున్న ప్రచారానికి ఆయన తెరదించారు. “నాకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ (Congress) ఎప్పుడూ హామీ ఇవ్వలేదు, నేను కూడా ఆ పదవి కావాలని కోరలేదు” అని ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే పార్టీ బలోపేతానికి , ప్రభుత్వంలో భాగస్వామ్యం కోసం నామినేటెడ్ పోస్టులు, ఇతర ప్రభుత్వ పదవులను ఆశిస్తున్నామని, ఆ మేరకు చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.
Kodandaram Elections | బీఆర్ఎస్ పాలనపై విమర్శలు
బీఆర్ఎస్ (BRS) పాలనలో నెలకొన్న అప్రజాస్వామిక పరిస్థితులను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గతంలో ఎవరినైనా కలవాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సి వచ్చేది. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) భయంతో ప్రజలు తమ ఫోన్లను ఇంట్లోనే వదిలేసి, రహస్యంగా వచ్చి కలిసేవారు. భయం అంటే ఏంటో గత ప్రభుత్వం ప్రత్యక్షంగా చూపించింది అని విమర్శించారు. అమరవీరుల స్ఫూర్తి యాత్ర వంటి శాంతియుత కార్యక్రమాలకు కూడా అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారని, ప్రస్తుత పాలనలో అలాంటి వేధింపులు, నిఘా ఆంక్షలు లేవన్నారు.
Kodandaram Elections | కేసీఆర్, కవితలపై సెటైర్లు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) తీరును కోదండరాం తప్పుబట్టారు. “ప్రజలకు దూరమైతే ఏ పార్టీ మనుగడ సాగించలేదు, ఆ విషయం ఆలస్యంగా అర్థమై కేసీఆర్ ఇప్పుడు రోడ్లపైకి వస్తున్నారు. తన తప్పులను సరిదిద్దుకోవడం మానేసి.. ప్రజలే మారాలని ఆయన కోరుకోవడం విడ్డూరం” అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. “పార్టీ అంటే కేవలం తమ కుటుంబమేనని కవిత మాటల్లో స్పష్టమవుతోంది. ఆమె తెలియకుండానే తమ కుటుంబ లోపాలను బయటపెడుతున్నారు” అని వ్యాఖ్యానించారు.
ఎన్నికల బరిలోకి టీజేఎస్
ఎన్నికల రాజకీయాలపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ, కేవలం సామాజిక మార్పు కోసమే తాము రాజకీయాల్లోకి వచ్చామని, అయితే ఎల్లకాలం ఎన్నికలకు దూరంగా ఉండలేమని కోదండరాం స్పష్టం చేశారు. “వచ్చే ఎన్నికల్లో టీజేఎస్ కచ్చితంగా పోటీ చేస్తుంది” అని చెబుతూ, అధికారం కోసం కాకుండా నిజమైన మార్పు కోసమే తమ పార్టీ పని చేస్తోందని పునరుద్ఘాటించారు.
ఇది కూడా చదవండి..: Govt arrears release | ఉద్యోగులకు గుడ్న్యూస్.. బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం


[…] […]