అక్షరటుడే వెబ్‌డెస్క్: Komatireddy Venkata Reddy | గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌తో కుమ్మక్కై రాయలసీమ ( Rayalaseema ) లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అప్పటి సీఎం కేసీఆర్ పూర్తిగా సహకరించారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. సోమవారం నల్గొండలోని రామాలయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చేలా నాటి ప్రభుత్వం వ్యవహరించడం వల్లే తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర భంగం వాటిల్లిందని మండిపడ్డారు.
Komatireddy Venkata Reddy | తప్పుడు నిర్ణయాల కారణంగా..
శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణకు దక్కాల్సిన నీటి హక్కులను, అవకాశాలను గత పాలకుల తప్పుడు నిర్ణయాల కారణంగా కోల్పోయామని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులకు కేసీఆర్ విధానాలే ప్రధాన కారణమని ఆరోపించారు. తెలంగాణ రైతాంగానికి జరిగిన నష్టానికి కేసీఆర్ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నీటి హక్కుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలపై ఎలాంటి రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
Komatireddy Venkata Reddy | 2028 నాటికి ఎస్‌ఎల్‌బీసీ పూర్తి..
నల్గొండ జిల్లా సాగు, తాగునీటి అవసరాలకు ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు అత్యంత కీలకమని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ప్రతిష్టాత్మక ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును 2028 నాటికి పూర్తి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన వెల్లడించారు.
ఇది కూడా చదవండి: SS Retail IPO | ఐపీవోకు ఎస్ఎస్ రిటైల్.. ఆకర్షణీయంగా జీఎంపీ