అక్షరటుడే వెబ్‌డెస్క్: KTR Comments | తెలంగాణలో ( Telangana ) కాంగ్రెస్ పాలన భూముల దోపిడీకి అడ్డాగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో 22ఏ నిషేధిత భూముల అంశంపై పార్టీ ముఖ్య నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌తో పాటు ప్రభుత్వ భూ కుంభకోణాలపై పలు సంచలన ఆరోపణలు గుప్పించారు. సభలో ప్రజా సమస్యలను లేవనెత్తకుండా తమను అడ్డుకోవడానికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బలవంతంగా బయటికి గెంటేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బాగోతాలు, అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం పేరుతో యథేచ్ఛగా ల్యాండ్ మాఫియా చెలరేగిపోతోందని విమర్శించారు.
KTR Comments | అలీ బాబా అరడజన్ దొంగల్లా..
బీఆర్ఎస్ హయాంలో 22ఏ కింద కేవలం 16 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాన్ని ఏకంగా కోటి 16 లక్షల ఎకరాలకు పెంచారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కేవలం నిబంధనల పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందుల పాలుచేస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని సముద్రలింగాపురం గ్రామంలో ఏకంగా 800 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అక్రమాలపై త్వరలోనే రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారిక యంత్రాంగానికి సమాంతరంగా వేరే వ్యవస్థ నడుస్తోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం బ్రదర్స్, మంత్రుల ముఠా కలిసి ‘అలీ బాబా అరడజన్ దొంగల్లా’ తయారై ప్రభుత్వ భూములను హారతి కర్పూరంలా కరిగిస్తున్నారని ఆరోపించారు. మంత్రుల మధ్య వాటాల పంపకాల పంచాయతీ బెడిసికొట్టడంతోనే ఒకరిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారని పేర్కొన్నారు. ‘తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు’ అన్నట్లుగా సీఎం కుటుంబ సభ్యులు దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.
KTR Comments |అత్తసొమ్మును అల్లుడికి దానం ..
గతంలో ఆర్టీఐని అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేసే రేవంత్ రెడ్డి .. అటవీ శాఖ మంత్రి అయిన వీరప్పన్ తరహాలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా మారి విలువైన భూములను తన అనుచరులకు ధారాదత్తం చేస్తున్నారని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అత్తసొమ్మును అల్లుడికి దానం చేసినట్లుగా నగర నడిబొడ్డున ఉన్న పారిశ్రామిక భూములు, మూసీ సుందరీకరణ పేరుతో వేల ఎకరాలను కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీలో ఏకంగా రూ.200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.7 కోట్లకే కేటాయించారని ఆరోపించారు. 2014కు ముందు భూములు కొనాలంటే ప్రజల్లో తీవ్ర భయాలు ఉండేవని, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే చెరువులకు జీవం పోసి ఎకరం రూ.5 లక్షల విలువైన భూమిని రూ.50 లక్షలకు చేర్చామని కేటీఆర్ గుర్తుచేశారు. కొంగర కలాన్‌లో కలెక్టరేట్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. రాబోయే రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని.. ప్రస్తుతం 22ఏ జాబితాలో పెట్టిన భూములన్నింటినీ తాము అధికారంలోకి వచ్చాక పూర్తిగా పరిరక్షిస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Crude Oil Prices | క్రూడ్ ఆయిల్ ధరలు పైపైకి.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు