అక్షరటుడే, వెబ్‌డెస్క్: Power Cuts | రాష్ట్రంలో రైతులు (Farmers) కరెంట్ కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో ఈ వానాకాలం సీజన్లో రాష్ట్రంలో లోటు వర్షపాతం నమోదు అయింది. సీజన్ ప్రారంభంలో చెప్పుకోదగ్గ వర్షాలు పడలేదు. జులై 20 నుంచి ఆగస్టు మధ్య వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడటంతో రైతులు పంటలు సాగు చేశారు. అయితే గత 20 రోజులుగా వానలు లేవు. ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రస్తుతం వరి పంట పొట్ట, ఈనిక దశలో ఉంది. ఈ సమయంలో నీరు ఎక్కువ అవసరం. అయితే వర్షాలు లేకపోవడంతో రైతులు బోరుబావులపై ఆధార పడుతున్నారు.
Power Cuts | పారని పొలాలు
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. దీంతో పొలాలు పారడం లేదు. రాత్రిపూట కరెంట్ ఇవ్వడం లేదు. రోజుకు 8 నుంచి 12 గంటల లోపు మాత్రమే త్రీ ఫేస్ కరెంట్ ఉంటుంది. ఆ సమయంలో మళ్లీ ఎల్సీలు, కరెంట్ కోతలు ఉంటున్నాయి. దీంతో 8 గంటలు కూడా సరిగా కరెంట్ ఉండటం లేదు. కొన్ని గ్రామాల్లో అయితే 5 నుంచి 8 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీంతో నీరు పారక పొలాలు ఎండిపోతున్నాయి.
Power Cuts | పట్టించుకోని ప్రభుత్వం
విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు ఆందోళన బాట పట్టారు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. సబ్ స్టేషన్లను ముట్టడిస్తున్నారు. అయినా అధికారులు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికే వరి పంటను తెగుళ్లు ఆశించడంతో రైతులు పురుగు మందులకు భారీగా ఖర్చు చేశారు. మరోవైపు ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. పెట్టుబడి పెట్టి చేసిన పంట చేతికొచ్చే సమయంలో కరెంట్ లేక.. పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: KTR Comments | అలీ బాబా అరడజన్ దొంగల్లా ల్యాండ్ చోరీ.. రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు