అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Liquor Prices | తెలంగాణ (Telangana)లోని మందుబాబులకు త్వరలో భారీ షాక్ తగలవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ధరల పెంపుపై అధ్యయనం చేసిన కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందించగా, దీనిపై తుది నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనంతరం మద్యం ధరల పెంపు నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సాధారణ బ్రాండ్ల నుంచి ప్రీమియం బ్రాండ్ల వరకు దాదాపు అన్ని రకాల మద్యం ధరల్లో పెరుగుదల ఉండవచ్చని చెబుతున్నారు. దాదాపు 10 నుంచి 15 శాతం వరకు ధరలు పెరగొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
Telangana Liquor Prices | భారీగా పెరగనున్న మద్యం ధరలు..
మద్యం Liquor తయారీ సంస్థలు గత కొంతకాలంగా ధరల పెంపు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మద్యం ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగిందని కంపెనీలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ముడి సరుకులు, గాజు సీసాల ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం కూడా తయారీ వ్యయంపై ప్రభావం చూపిందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో మొత్తం తయారీ ఖర్చు 15 నుంచి 20 శాతం వరకు పెరిగిందని కంపెనీలు ప్రభుత్వానికి వివరించినట్లు తెలుస్తోంది.
Telangana Liquor Prices | పరిమిత పెంపునే అమలు చేసే దిశగా ప్రభుత్వం
ఇక మద్యం ధరలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం గతంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లోని మద్యం ధరలు, మార్కెట్ పరిస్థితులు, ఉత్పత్తి వ్యయాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నివేదికలో 25 నుంచి 30 శాతం వరకు ధరలు పెంచే అవకాశాలపై సూచనలు చేసినట్లు సమాచారం. అయితే అంత పెద్ద స్థాయిలో ధరలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
అందుకే 10 నుంచి 15 శాతం వరకు పరిమిత పెంపునే అమలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.ఇక ధరల పెంపుతో ప్రభుత్వ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కొన్ని బ్రాండ్ల మద్యం ధరలు తక్కువగా ఉన్నాయని కూడా అధికారులు చెబుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రభుత్వం నుంచి తుది ప్రకటన వచ్చిన తర్వాతే ధరల పెంపుపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: Saraswati Pushkaralu | సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం


