Lungi Ngidi Injury | లుంగీ ఎంగిడికి తప్పిన ప్ర‌మాదం.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lungi Ngidi Injury | లుంగి ఎంగిడికి (Ngidi) జ‌రిగిన ప్ర‌మాదంతో ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో కొద్దిగంటల పాటు తీవ్ర ఆందోళన నెలకొన్న విష‌యం తెలిసిందే. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు కీలక పేసర్ లుంగీ ఎంగిడి గాయపడటంతో ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్ టెన్షన్ ప‌డ్డారు. అయితే చివరికి ఎలాంటి ప్రమాదం లేకుండా ఆయన క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మ్యాచ్ సందర్భంగా క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఎంగిడి కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే ఫిజియో గ్రౌండ్‌లోకి చేరుకుని చికిత్స అందించేందుకు ప్రయత్నించినప్పటికీ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన మ్యాచ్‌లో ఉద్రిక్తతను పెంచింది.

Lungi Ngidi Injury | ఎంగిడి డిశ్చార్జ్

వైద్యుల పరీక్షల్లో ఎంగిడి మెడ భాగంలో ఒత్తిడి కారణంగా తాత్కాలిక సమస్య ఏర్పడినట్లు తేలింది. అదృష్టవశాత్తూ అది తీవ్రమైన గాయం కాకపోవడంతో కేవలం ఒకరోజులోనే ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) సహ యజమాని గ్రంధి కిరణ్ కుమార్ స్వయంగా వైద్యులతో మాట్లాడి చికిత్సను పర్యవేక్షించినట్లు సమాచారం. ఎంగిడి ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ, ఆయన మళ్లీ ఎప్పుడు జట్టుకు అందుబాటులోకి వస్తారనే విషయంపై స్పష్టత లేదు. జట్టు వైద్య బృందం పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకోనుంది.

Lungi Ngidi Injury | కీలక బౌలర్​

ఈ సీజన్‌లో ఎంగిడి ఢిల్లీ క్యాపిటల్స్‌కు కీలక బౌలర్‌గా నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్‌ (LSG)పై జరిగిన తొలి మ్యాచ్‌లో 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి మెప్పించాడు. ముంబై ఇండియన్స్‌ (MI)పై ఒక వికెట్, గుజరాత్‌పై మరో వికెట్ తీసి జట్టుకు సహకరించాడు. అయితే ఆ తర్వాత మ్యాచ్‌లలో అతని ప్రదర్శన కొంత మందగించింది. ఎంగిడి గాయపడిన అదే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలవడం జట్టుకు మరో షాక్‌గా మారింది. భారీ లక్ష్యం ఉన్నప్పటికీ బౌలింగ్ వైఫల్యంతో మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. ముఖ్యంగా ఎంగిడి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేకపోవడం జట్టు ఫలితంపై ప్రభావం చూపింది. ఎంగిడి క్షేమంగా బయటపడటం ఢిల్లీ క్యాపిటల్స్‌కు పెద్ద ఊరటనిచ్చింది. ఇక ఆయన త్వరగా కోలుకుని మళ్లీ మైదానంలోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

dc 1

దీనిని కూడా చదవండి : Vaibhav Suryavanshi Century | SRHపై విరుచుకుపడ్డ RR యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 36 బంతుల్లో సెంచరీ!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *