Medical College Ragging | ర్యాగింగ్​ కోరల్లో మెడికల్​ కళాశాల.. జూనియర్లపై సీనియర్ల ఆగడాలు

కామారెడ్డి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Medical College Ragging | కామారెడ్డి (Kamareddy) మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. ఐదు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది.  జూనియర్ విద్యార్థుల పట్ల సీనియర్లు ప్రవర్రించిన తీరు చర్చనీయాంశంగా మారింది. కొంతమంది విద్యార్ధులపై ర్యాగింగ్ చేసినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే విచారణ చేపట్టి ఘటనకు బాద్యులైన 14 మంది విద్యార్ధులపై సస్పెన్షన్ విధిస్తూ చర్యలు తీసుకున్నారు.

Medical College Ragging | కళాశాల చరిత్రలో తొలిసారి..

కళాశాల ప్రారంభమైన నాలుగేళ్లలో మొట్టమొదటి సారి ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. కళాశాలలో మొత్తం 400 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో డే స్కాలర్​లో 100 మంది, హాస్టల్ లో 300 మంది విద్యార్థులున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ర్యాగింగ్ ఫిర్యాదులు లేకుండా సాఫీగా సాగుతున్న కళాశాలలో ఒక్కసారిగా ఈ ఘటన వెలుగులోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మొదటి సంవత్సరం విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేశారన్న ఆరోపణలతో కళాశాలలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొత్తగా కళాశాలలో అడుగుపెట్టిన విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారని, వారిలో కొందరు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పారని సమాచారం.

Medical College Ragging | ఎన్​హెచ్ఎం సైట్​లో ఆన్​లైన్ ఫిర్యాదు

బాధిత విద్యార్థులు ఎన్​హెచ్ఎం సైట్​లో ఆన్​లైన్ ద్వారా ఈనెల 28న రాత్రే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తమకు జరిగిన వేధింపులను వారు ఆన్​లైన్​లో వివరించినట్లు తెలుస్తోంది. పేరు బయటపెట్టడానికి ఇష్టపడని విద్యార్థులు ఆన్​లైన్ వేదికను ఆశ్రయించారని చెబుతున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే కళాశాల యాజమాన్యం అప్రమత్తమైంది. ఉన్నతాధికారులకు సమాచారం చేరడంతో వెంటనే విచారణకు ఆదేశించారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ రంగంలోకి దిగి బాధితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల నుంచి విడివిడిగా వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.

Medical College Ragging | 14 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు

విషయం తెలిసిన వెంటనే విచారణ చేపట్టి ఘటనకు బాధ్యులైన 14మంది విద్యార్థులపై సస్పెన్షన్ విధిస్తూ చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో ర్యాగింగ్ జరిగినట్లు తేలడంతోనే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. సస్పెన్షన్​కు గురైన విద్యార్థులు ఏ సంవత్సరం వారు, వారి పాత్ర ఏంటి అనే వివరాలు మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. సస్పెన్షన్ కాలం ఎంత, వారిపై తదుపరి చర్యలు ఏముంటాయి అనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఈ చర్యతో కళాశాలలో ఇతర విద్యార్థుల్లో కూడా భయం మొదలైనట్లు చెబుతున్నారు.

Medical College Ragging | లీక్ వెనుక ఎవరు..? అంతర్గత విచారణ

అసలేం జరిగింది అనేదానిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది. ర్యాగింగ్ విషయం బయటకు ఎలా లీకైంది, ఫిర్యాదు వెనుక ఎవరు ఉన్నారు అనే అంశంపైనా అంతర్గత విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కళాశాలలో ర్యాగింగ్ నిరోధక చర్యలు ఎంతవరకు పటిష్ఠంగా ఉన్నాయి అనే ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. హాస్టల్​లో, కళాశాల ఆవరణలో నిఘా ఎలా ఉంది, యాంటీ ర్యాగింగ్ సెల్ ఎంత చురుకుగా పనిచేస్తోంది అనే అంశాలపై కూడా విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఘటన కామారెడ్డిలో కలకలం రేపింది. తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. డాక్టర్ కావాలనే కలతో కామారెడ్డి వచ్చిన విద్యార్థులకు ఇలాంటి అనుభవం ఎదురు కావడం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ర్యాగింగ్​పై కఠినచర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: ATM Robbery Attempt | ఆర్మూర్​లో ఏటీఎం చోరీకి యత్నం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *