Modi Economic Strategy | ఆర్థిక క్రమశిక్షణే ఆయుధం.. మోడీ ‘లైఫ్‌స్టైల్’ మంత్రం వెనుక దాగి ఉన్న వ్యూహం ఇదేనా?

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Modi Economic Strategy | ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి అనిశ్చితి దిశగా అడుగులు వేస్తోంది. ఒకవైపు మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ముడి చమురు ధరలు, సరఫరా గొలుసుల సంక్షోభం… ఈ పరిణామాలన్నీ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్ర స్థాయిలో ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రసంగంగా కాకుండా.. దేశ ప్రజలకు ఇచ్చిన ఒక ఆర్థిక హెచ్చరికగా మారాయి.

“అనవసర ఖర్చులు తగ్గించండి… ఇంధన వినియోగాన్ని నియంత్రించండి… స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించండి… పొదుపును అలవాటు చేసుకోండి…” అనే సందేశం వెనుక దేశ ఆర్థిక భద్రతకు సంబంధించిన ఒక పెద్ద వ్యూహమే దాగి ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

oil

Modi Economic Strategy | భారత్‌కు అతిపెద్ద ఆర్థిక సవాల్.. చమురు దిగుమతులు

ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశం భారత్​. అయితే దేశానికి అవసరమైన ముడి చమురులో సుమారు 85% వరకు దిగుమతులపైనే ఆధారపడటం ఆందోళన చెందాల్సిన అంశం.

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ దాదాపు 232 మిలియన్ టన్నుల ముడి చమురు దిగుమతి చేసుకుంది. ఇందుకోసం సుమారు 120 – 135 బిలియన్ డాలర్ల వరకు విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చెయాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అంచనాల ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రుడాయిల్ ధర ఒక్క డాలర్ పెరిగితే దేశ దిగుమతి బిల్లు సుమారు ₹8,000 – ₹10,000 కోట్ల వరకు పెరిగే ప్రమాదం ఉంటుంది.

ఇది కేవలం పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకే పరిమితం కాదు. రవాణా వ్యయం పెరగడం వల్ల ఆహార పదార్థాల ధరలపై ప్రభావం పడుతుంది. పరిశ్రమల ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. ద్రవ్యోల్బణం (Inflation) అధికమవుతుంది.

Modi Economic Strategy | WFH వెనుక ఆర్థిక లెక్కలు

నరేంద్ర మోడీ సూచించిన “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆలోచన వెనుక పెద్ద ఆర్థిక లెక్కలే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్‌లో రోజూ కోట్ల సంఖ్యలో ద్విచక్ర, నాలుగు చక్ర వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి.

కొన్ని అధ్యయనాల ప్రకారం.. మెట్రో నగరాల్లో ఉద్యోగుల ప్రయాణాల వల్ల రోజుకు లక్షల లీటర్ల ఇంధనం ఖర్చవుతోంది. ఐటీ రంగంలో 25-30% ఉద్యోగులు శాశ్వతంగా WFH కొనసాగించినా.. ఏటా రూ.వేల కోట్లలో ఇంధన పొదుపు సాధ్యమవుతుందని అంచనా. వర్క్​ ఫ్రం హోమ్​ వల్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడమే కాకుండా, కార్బన్ ఉద్గారాలను కూడా తగ్గించినవారం అవుతాం.

Gold Silver Rates April 22

Modi Economic Strategy | బంగారం: భావోద్వేగ సంపదా..? ఆర్థిక భారమా..?

భారతీయ కుటుంబాల్లో పసిడి అనేది ఒక భావోద్వేగ ఆస్తి. కానీ, దేశ ఆర్థిక వ్యవస్థ కోణంలో చూస్తే అది అతిపెద్ద దిగుమతి భారంగా మారుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల్లో భారత్ ఒకటి. ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం వినియోగ దేశంగా భారత్ మారడం ఆందోళనకరం.

ప్రతి సంవత్సరం భారత్ దాదాపు 700 – 900 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటోంది. దీనికోసం సుమారు 45 – 60 బిలియన్ డాలర్ల వరకు విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేయాల్సి వస్తోంది.

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బంగారం అనేది ఉత్పాదక పెట్టుబడి కాదు. ఉద్యోగాలను సృష్టించదు. పరిశ్రమలకు నేరుగా మూలధనం ఇవ్వదు. అందుకే కేంద్ర ప్రభుత్వం గతంలో Sovereign Gold Bonds, Gold Monetisation Scheme, Gold Import Duty పెంపు వంటి చర్యలను తీసుకుంది.

ప్రజల పొదుపులు: ప్రజలు బంగారం కొనుగోళ్లకు వెచ్చించే సొమ్మును బ్యాంకు డిపాజిట్లలోకి, స్టాక్ మార్కెట్లలోకి, మ్యూచువల్ ఫండ్లలోకి మళ్లిస్తే.. ఆ నిధులు దేశ అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడతాయని కేంద్రం భావిస్తోంది.

Cooking Oil Price Rise

Modi Economic Strategy | ఆహార భద్రతకు పెద్ద ముప్పు.. వంటనూనెల దిగుమతులు

దేశ అవసరాల్లో దాదాపు 60-70% వరకు edible oil imports ద్వారానే నెరవేరుతున్నాయి. ఇందులో ప్రతి సంవత్సరం సుమారు 14 – 16 మిలియన్ టన్నుల వంటనూనెలను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. అంటే ఇందుకోసం దాదాపు 18 – 22 బిలియన్ డాలర్ల వరకు ఖర్చవుతోంది.

భారత్​కు ప్రధాన సరఫరాదారులు

  • ఇండోనేషియా – Palm Oil
  • మలేషియా – Palm Oil
  • ఉక్రెయిన్ – Sunflower Oil
  • అర్జెంటీనా, బ్రెజిల్ – Soy Oil

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ సరఫరాలో అంతరాయం ఏర్పడి భారత్‌లో వంటనూనెల ధరలు భారీగా పెరిగిన విషయాన్ని ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేరు. ఇటీవల ఇరాన్​ – ఇజ్రాయెల్​ – అమెరికా యుద్ధం వల్ల కూడా ధరలు పెరిగిన విషయం తెలిసిందే.

Modi Hyderabad Visit

Modi Economic Strategy | ప్రభుత్వం వ్యూహం

ఆయిల్‌సీడ్ సాగుకు ప్రోత్సాహం అందిస్తోంది. పామ్ ఆయిల్ మిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సాహం, వంట నూనెల వినియోగాన్ని నియంత్రించడం వంటి చర్యల ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని కేంద్రం చూస్తోంది.

తాజాగా “వోకల్ ఫర్ లోకల్” నినాదం గుర్తుచేస్తున్నారు. ఈ నినాదం వెనుక కూడా స్పష్టమైన ఆర్థిక వ్యూహం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్‌లో దాదాపు 6.3 కోట్ల MSME యూనిట్లు ఉన్నాయి. ఇవి సుమారు 11 కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. దేశ GDPలో MSME రంగం వాటానే సుమారు 30%గా ఉంటోంది. ఎగుమతుల్లో సుమారు 45% వరకు MSME రంగం నుంచి వస్తుండటం విశేషం.

Modi Economic Strategy | బలహీనం చేస్తున్న విదేశీ ఉత్పత్తులు..

విదేశీ ఉత్పత్తులపై అధికంగా ఆధారపడటం వల్ల దేశీయ పరిశ్రమలు బలహీనపడుతున్నాయి. ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. పరాయిదేశాల ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల విదేశాలకు లాభాలు వెళ్తున్నాయి.

అందుకే ప్రభుత్వం PLI Scheme, Make in India, Startup India, Atmanirbhar Bharat వంటి కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది.

Modi Economic Strategy | రాబోయే రోజుల్లో ఏం జరగవచ్చు?

నరేంద్ర మోడీ తాజా సంకేతాలను బట్టి చూస్తే.. భవిష్యత్తులో కేంద్రం కొన్ని కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వాటిలో కొన్ని ఈ విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అవెంటో ఓసారి చూద్దాం..

  • బంగారం, విలాస వస్తువులపై అధిక దిగుమతి సుంకాలు
  • ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ సబ్సిడీలు
  • స్థానిక తయారీకి పన్ను రాయితీలు
  • ప్రకృతి వ్యవసాయానికి మరిన్ని ప్రోత్సాహకాలు
  • ఎథనాల్ మిశ్రమ ఇంధన వినియోగ విస్తరణ
  • Renewable Energyపై మరింత దృష్టి

Modi Economic Strategy | ప్రజల జీవనశైలే దేశ ఆర్థిక భద్రతకు ఆయుధం!

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరుగుతున్న నేపథ్యంలో దేశాన్ని కాపాడేది కేవలం కేంద్ర ప్రభుత్వ విధానాలు మాత్రమే కావని, ప్రజల వినియోగపు అలవాట్లు కూడా అంతే కీలకమని మోడీ ప్రసంగం స్పష్టం చేస్తోంది. ఒక్కో కుటుంబం చేసే చిన్న పొదుపు… ఒక్కో వ్యక్తి తగ్గించే అనవసర ఖర్చు… ఒక్కో సంస్థ పాటించే ఇంధన క్రమశిక్షణ… ఇవన్నీ దేశ ఆర్థిక భద్రతకు కవచంలా మారే అవకాశం ఉందనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.

“కనీస అవసరాలు – గరిష్ట పొదుపు” అనే భావన కేవలం వ్యక్తిగత ఆర్థిక సూత్రం మాత్రమే కాదు… ప్రపంచ సంక్షోభాల మధ్య భారత్‌ను రక్షించే జాతీయ ఆర్థిక వ్యూహంగా పేర్కొనవచ్చు.

Bandi Bhagirath POCSO Case | కేంద్ర మంత్రి హోదాలో బాధ్యత మరిచారా? పరారీలో ‘బండి’ కుమారుడు.. చట్టానికి సవాల్‌గా మారిన వ్యవహారం!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *