Municipality BRS | చైర్మన్ భర్త పెత్తనాన్ని సహించేది లేదు.. బీఆర్ఎస్ కౌన్సిలర్ల అల్టిమేటం

మున్సిపల్ చైర్ పర్సన్ భర్త ఆగడాలు రోజురోజుకు హద్దులు దాటుతున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Municipality BRS | మున్సిపల్ చైర్ పర్సన్ భర్త ఆగడాలు రోజురోజుకు హద్దులు దాటుతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా ఆయన వైఖరి మార్చుకోవడం లేదు. ఇలాగే కొనసాగితే ఆయన పెత్తనాన్ని ఏమాత్రం సహించేది లేదని బీఆర్ఎస్ కౌన్సిలర్లు అల్టిమేటం జారీ చేశారు. కామారెడ్డి (Kamareddy) బల్దియాలో నెలకొన్న సమస్యలతో పాటు ఇటీవల జరుగుతున్న పరిణామాలపై వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ ను కలిశారు.

Municipality BRS | కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం లేదు

అనంతరం మీడియాతో మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. పండుగకు ముందు వార్డుల్లో తిరిగినప్పటికీ సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో బతుకమ్మలను నిమజ్జనం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పట్టణంలో సమస్యలు తీవ్రంగా ఉన్నా రెండు నెలలుగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం లేదని మండిపడ్డారు. వెంటనే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వార్డుల్లో గుంతల పూడిక కోసం మూడు నెలల క్రితమే కలెక్టర్ రూ.28 లక్షలు మంజూరు చేసినా పనులు చేయలేదని, ఆ డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. కరప్షన్, కలెక్షన్ పై ఉన్న శ్రద్ధ పనులు చేయడంపై లేదని ఆరోపించారు. వినాయక చవితి, దసరా ఉత్సవాల సందర్భంగా చెరువు వద్ద మిగిలిపోయిన స్క్రాప్ ఏమైందని ప్రశ్నించారు.

Municipality BRS | స్క్రాప్ ను కూడా లెక్క చూపడం లేదు

దాదాపు 800 వినాయకులు, 300 దుర్గామాతల నిమజ్జనం తర్వాత వచ్చిన స్క్రాప్ ను కూడా లెక్క చూపడం లేదన్నారు. వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. నూతన పాలకవర్గం ఏర్పడి 7 నెలలు అవుతున్నా 49 వార్డుల్లో కనీసం రూ.50 వేల పనులు కూడా జరగలేదన్నారు. 16వ వార్డులో మున్సిపల్ స్థలంలో అక్రమ ఇంటి నిర్మాణం జరుగుతోందని, దానిని ఆపడానికి వెళ్తే అధికార పార్టీ వాళ్లు అడ్డుకుని కమిషనర్, టీపీవోలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. గత కౌన్సిల్ ఉన్నప్పుడే ఆ నిర్మాణాన్ని నిలిపివేశామని, ఎక్కడైతే అక్రమ కట్టడాలు జరుగుతున్నాయో పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వార్డుకు రూ.6 లక్షల చొప్పున కేటాయించాలని గత కౌన్సిల్ లో ఏకగ్రీవ తీర్మానం చేసినా ఇప్పటికీ ఇవ్వడం లేదన్నారు. రెండు నెలలుగా చైర్మన్ సంతకం చేయకపోతే అధికారులు కూడా సైలెంట్ గా ఉంటున్నారని, అలాంటప్పుడు సమావేశాలు ఎందుకు, కౌన్సిల్ ఎందుకని ప్రశ్నించారు.

Municipality BRS | మున్సిపాలిటీని చైర్మన్ భర్తకు దాసోహం 

బల్దియాలో జనరల్ ఫండ్ ఉందని, గతంలో ఉన్న కాంట్రాక్టర్ల వద్ద 10 నుంచి 15 శాతం కమిషన్ తీసుకుని చైర్మన్ భర్త కలెక్షన్ చేస్తున్నారని ఆరోపించారు. గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని, ఎన్నిసార్లు చెప్పినా వైఖరి మార్చుకోవడం లేదన్నారు. కార్యాలయంలో సీసీ కెమెరాల యాక్సెస్ ఆయన వద్ద పెట్టుకుని కౌన్సిలర్లు అధికారుల వద్దకు వెళ్తే ఎందుకు వచ్చారని ఫోన్ చేసి అడుగుతున్నారని ఆరోపించారు. చైర్మన్ భర్త ఎవరని, సీసీ కెమెరాల యాక్సెస్ ఆయనకు ఎందుకు ఉంటుందని, అది కమిషనర్ పరిధిలో ఉండాలని అన్నారు. మున్సిపాలిటీని చైర్మన్ భర్తకు దాసోహం చేశారని మండిపడ్డారు. ఒక గ్రూప్ కలెక్షన్లకు తిరుగుతుంటే మరో గ్రూప్ సంబంధం లేని వార్డుల్లో తిరుగుతూ ఫిర్యాదులు చేస్తూ మానసికంగా వేధిస్తూ కలెక్షన్ చేస్తున్నారని ఆరోపించారు. గణేష్, దుర్గామాత స్క్రాప్ ను కూడా ఈ గ్రూపులు అమ్ముకుంటుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారన్నారు. బల్దియాలో పని చేస్తున్న నలుగురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పక్కన పెట్టి ప్రైవేటు వ్యక్తులను పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అనుమతి లేకుండా జరుగుతున్న పనులను ఆపమని అధికారులు పంపిస్తే ఆ ఉద్యోగులను తొలగిస్తారా అని నిలదీశారు.

Municipality BRS | చైర్మన్ భర్త ఆగడాలు సహించేది లేదు

ఆ నలుగురు ఉద్యోగులను తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు. ఇదే చివరి వార్నింగ్ అని, చైర్మన్ భర్త ఆగడాలు ఎక్కువయ్యాయని ఇక సహించేది లేదన్నారు. తమ నినాదం ఒక్కటేనని.. చైర్మన్ భర్త గో బ్యాక్ అని నినదించారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని, లేకుంటే మున్సిపాలిటీలోకి వస్తే మెడబట్టి బయటకు గెంటేస్తామని హెచ్చరించారు. పట్టణ ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తమను సంప్రదించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు కుంబాల్ రవి యాదవ్, కౌన్సిలర్లు అఫీజ్, గర్కంటి స్వప్న, గర్కంటి లక్ష్మణారాయణ, మామిండ్ల లక్ష్మణ్, అజాజ్, గోపు బాలమణి, లోలం శ్రీనివాస్, మన్సూర్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Drinking Water | జిల్లాలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు..: సుదర్శన్​రెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *