Nepal Flood Rescue | ఆ మంత్రమే కాపాడింది.. 9 రోజుల తర్వాత సజీవంగా బయటపడిన కార్మికులు

నేపాల్‌ను అతలాకుతలం చేసిన భారీ వరదల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ, కొన్ని చోట్ల మాత్రం ఆశ్చర్యకరమైన ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Nepal Flood Rescue | నేపాల్‌ను అతలాకుతలం చేసిన భారీ వరదల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ, కొన్ని చోట్ల మాత్రం ఆశ్చర్యకరమైన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. వరదల్లో కొట్టుకుపోయి దాదాపు 9 రోజుల పాటు ఓ టన్నెల్‌లో చిక్కుకుపోయిన ఇద్దరు హైడ్రో పవర్ కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో 30 ఏళ్ల సంజయ్ షా ఎలాంటి ఆహారం, నీరు లేకుండా తొమ్మిది రోజుల పాటు టన్నెల్‌లోనే సజీవంగా ఉండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

Nepal Flood Rescue | మహామంత్రమే కాపాడింది..

ప్రమాదం జరిగినప్పటి నుంచి తమను తాము కాపాడుకోవడానికి నిరంతరం దేవుడిని ప్రార్థించామని, మహామంత్రాన్ని జపిస్తూ ఆ తొమ్మిది రోజులు గడిపామని సంజయ్ షా తెలిపారు. శుక్రవారం రోజు బురదమయమైన మార్గం గుండా రక్షణ సిబ్బంది ఆయనను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను నేపాల్ ఇంధన మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. బయటకు వచ్చిన వెంటనే ఆయన్ను హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఆయనతో పాటు మరో కార్మికుడు కూడా ప్రాణాలతో బయటపడ్డారు, వీరిద్దరూ నేపాల్‌కే చెందినవారు.

Nepal Flood Rescue | ఒక్కసారిగా భారీ వరదలు..

ఆగస్టు 26న చైనా-నేపాల్ సరిహద్దుల్లోని పర్వత ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడటంతో భోటేకోశి, త్రిశూలి నదులకు ఒక్కసారిగా భారీ వరదలు పోటెత్తాయి. ఈ పెను విపత్తులో నదీ పరివాహక గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం 1,280 మంది మరణించగా, 5,500 మందికి పైగా గల్లంతయ్యారు.

ఈ ప్రమాదం సంభవించిన సమయంలో ఎగువ త్రిశూలి-3ఏ హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌లో మెకానికల్ ఫోర్‌మన్‌గా పనిచేస్తున్న సంజయ్ షా.. టన్నెల్‌లో 170 మీటర్ల లోతులో చిక్కుకుపోయారు. ప్రమాద హెచ్చరికలు రాగానే బయటకు పరుగెత్తినప్పటికీ, తన సహచరులను వదిలి వెళ్లలేదని ఆయన చెప్పారు. ఇంతలో ఒక్కసారిగా భారీ ప్రవాహంతో నీరు ముంచెత్తడంతో బయటకు వెళ్లే దారులన్నీ మూసుకుపోయాయి. టన్నెల్ చాలా పొడవుగా ఉండటంతో లోపల ఎక్కడెవరు ఉన్నారో కూడా తెలుసుకోవడం అసాధ్యంగా మారిందని తెలిపారు. 9 రోజుల తర్వాత సురక్షితంగా బయటపడటం తనకు దేవుడు ఇచ్చిన పునర్జన్మ అని ఆయన భావోద్వేగంతో చెప్పారు.

Nepal Flood Rescue  | ఆక్సిజన్ లభించడం వల్లే..

దాదాపు 4.5 కిలోమీటర్ల పొడవైన ఆ టన్నెల్‌లో ఎంతో కొంత గాలి, ఆక్సిజన్ స్థిరంగా లభించడం వల్లే వారు శ్వాసించగలిగారని రెస్క్యూ నిపుణులు అంచనా వేస్తున్నారు. నేపాల్ రక్షక సిబ్బందితో పాటు భారత్, చైనా, దక్షిణ కొరియా దేశాలకు చెందిన నిపుణులు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయం అందిస్తున్నారు. హైడ్రోపవర్ టన్నెల్స్‌లో ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉంటారనే అనుమానంతో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

 

ఇది కూడా చదవండి:  Gutpa Alisagar Irrigation Water | ఫలించిన సుదర్శన్​ రెడ్డి, భూపతిరెడ్డి కృషి.. ఖరీఫ్​కు నీటివిడుదల

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *