ఆంధ్రప్రదేశ్​Nidubrolu Railway Station | నిడుబ్రోలు రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత.. సిగ్నల్ వ్యవస్థతో చెలగాటం, పోలీసుల...

Nidubrolu Railway Station | నిడుబ్రోలు రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత.. సిగ్నల్ వ్యవస్థతో చెలగాటం, పోలీసుల కాల్పులు

రైల్వే సిగ్నల్ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. దీంతో జీఆర్పీ పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nidubrolu Railway Station | గుంటూరు జిల్లాలోని నిడుబ్రోలు రైల్వే స్టేషన్‌ (Nidubrolu Railway Station) పరిధిలో సోమవారం రాత్రి కలకలం రేగింది. రైల్వే సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించడం, వారిని అడ్డుకునేందుకు వెళ్లిన ప్రభుత్వ రైల్వే పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

చివరకు పోలీసులు ఆత్మరక్షణ కోసం గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం, నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలోని సిగ్నల్ పాయింట్ వద్ద కొందరు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు జీఆర్పీ సిబ్బంది గుర్తించారు. అక్కడికి చేరుకుని పరిశీలించగా, వారు రైల్వే సిగ్నల్ వ్యవస్థకు సంబంధించిన వైర్లను కత్తిరించేందుకు, వ్యవస్థను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

Nidubrolu Railway Station | ప‌ది రౌండ్ల కాల్పులు..

దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే దుండగులు లొంగిపోవడానికి బదులుగా పోలీసులపైనే రాళ్లతో దాడి చేశారు. చీకటిని ఆసరాగా చేసుకుని భారీగా రాళ్లు రువ్వడంతో పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందుగా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ దుండగులు వెనక్కి తగ్గకపోవడంతో జీఆర్పీ పోలీసులు (GRP Police) గాలిలోకి పది రౌండ్లు కాల్పులు జరిపారు. తుపాకీ శబ్దాలతో నిడుబ్రోలు పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కాల్పులకు భయపడిన దుండగులు రైల్వే ట్రాక్ పక్కనున్న పొదల్లోకి పారిపోయి చీకట్లో అదృశ్యమయ్యారు. అనంతరం పోలీసులు ప్రాంతమంతా గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై రైల్వే అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రధాన రైల్వే మార్గం కావడంతో సిగ్నల్  వ్యవస్థను ధ్వంసం చేస్తే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశముందని తెలిపారు. అంతేకాదు, పెద్ద ప్రమాదాలు సంభవించే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన కేవలం దొంగతనానికి సంబంధించినదా లేక రైల్వే వ్యవస్థను దెబ్బతీసే కుట్రలో భాగమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించి, అక్కడ లభించిన ఆధారాలను సేకరించారు.

Nidubrolu Railway Station | స్టేషన్ పరిధిలో భద్రతమరింత కట్టుదిట్టం..

పరారైన దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం, పోలీసులపై దాడి చేయడం వంటి నేరాల కింద పలు సెక్షన్లతో కేసులు నమోదు చేసినట్లు జీఆర్పీ అధికారులు (GRP Officials) తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో నిడుబ్రోలు స్టేషన్ పరిధిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గతంలో కూడా ఈ మార్గంలోని అప్పికట్ల ప్రాంతంలో రైళ్లలో చోరీ ఘటనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. దీంతో తాజా ఘటనను పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం, సిగ్నల్ వ్యవస్థతో చెలగాటం ఆడడం తీవ్రమైన నేరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లనివ్వమని, ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: Constable Murder Kakinada | నడిరోడ్డుపై కాపు కాసి.. గొంతు కోసి.. కానిస్టేబుల్‌ దారుణ హత్య

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Telangana Cabinet Meeting | 21న రాష్ట్ర కేబినెట్ సమావేశం..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Cabinet Meeting | రాష్ట్ర మంత్రివర్గ...

Tamil Nadu CM Vijay | తమిళనాడు సీఎం విజయ్​ సంచలన నిర్ణయం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tamil Nadu CM Vijay | తమిళనాడు...

AIADMK Split | బిగ్ బ్రేకింగ్‌: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్‌కు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AIADMK Split | తమిళనాడు రాజకీయాల్లో కీలక...

Street Dog Attack | హైదరాబాద్​లో దారుణం.. బాలుడిపై 10 వీధికుక్కల దాడి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Street Dog Attack | హైదరాబాద్​ (Hyderabad)లో...