అక్షరటుడే వెబ్‌డెస్క్: Nitin Gadkari Politics | కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజకీయాలకు దూరమవుతున్నారనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల కాలంలో ఈ-20 ఇథనాల్ పెట్రోల్ విధానంపై వస్తున్న విమర్శలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. తాను గతంలోలా ఎక్కువగా పనిచేయలేకపోతున్నానని, ప్రజా పనుల్లో తన ప్రమేయం తగ్గిపోయిందని, సీనియర్లు కొత్త వారికి మార్గనిర్దేశం చేయాలని ఆయన పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా ప్రజా జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, ప్రశంసలు అందుకున్నానని ఆయన గుర్తుచేసుకున్నారు.
Nitin Gadkari Politics | జోరుగా ప్రచారం ..
మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో త్వరలో పునర్వ్యవస్థీకరణ జరగనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ధర్మేంద్ర ప్రధాన్ పరిణామాల తర్వాత సోషల్ మీడియాలో నితిన్ గడ్కరీని టార్గెట్ చేస్తూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తన శాఖ కాని పెట్రోలియం అంశాలపై ఆయన మాట్లాడటం, కుటుంబ వ్యాపార కోణాలను ఆపాదిస్తూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, అమిత్ షా కేబినెట్ కూర్పుపై కసరత్తు చేస్తున్నారన్న వార్తల నడుమ, గడ్కరీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు కూడా మారుతున్న తరుణంలో, బీజేపీ , మిత్రపక్షాల కొత్తవారికి మంత్రివర్గంలో చోటు లభించవచ్చనే ప్రచారంతో ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Nitin Gadkari Politics | స్పందించిన కార్యాలయం..
ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ( Nitin Gadkari )కార్యాలయం వెంటనే స్పందించింది. గడ్కరీ చేసిన వ్యాఖ్యలకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పింది. తాను స్వయంగా ఏర్పాటు చేసిన ‘లక్ష్మణ్ రావు మన్కర్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ఆదివాసీ ప్రాంతాల్లో నడుస్తున్న విద్యాసంస్థల బాధ్యతల గురించే ఆయన మాట్లాడారని వివరించింది. మునుపటిలా ఆ ట్రస్ట్ బాధ్యతలను తాను పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోతున్నానని, అందుకే యువతరానికి ఆ బాధ్యతలు అప్పగించాలని మాత్రమే అన్నారని, మీడియా దీనిని రాజకీయాలతో ముడిపెట్టిందని కార్యాలయం వెల్లడించింది. మంత్రి కార్యాలయం ఇచ్చిన ఈ స్పష్టతతో ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చింది.
ఇది కూడా చదవండి: TNGO Dharna Nizamabad | 27న టీఎన్జీవోస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ధర్నా