Nizamabad Red Cross Elections | నువ్వానేనా అన్నట్లుగా ‘రెడ్​క్రాస్’​ ప్రచారాలు.. రేపే ఎన్నికలు..

నిజామాబాద్​ జిల్లాలో రెడ్​క్రాస్​ ఎన్నికలకు రంగం సిద్ధమైంది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Red Cross Elections | జిల్లా (Nizamabad) రెడ్​క్రాస్​ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈమారు ఎన్నికలను పలువురు అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పూర్తి సేవా సంబంధిత సంస్థ అయిన రెడ్​క్రాస్​లో ఈ ఏడాది ఎన్నికలు రసవత్తరంగా జరుగనున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Nizamabad Red Cross Elections | ఆదర్శ హిందీ విద్యాలయంలో..

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 30 జిల్లా శాఖలతో పాటు నిజామాబాద్​ జిల్లా రెడ్​క్రాస్​ మేనేజింగ్​ కమిటీకి సైతం ఈనెల 4వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. నగరంలోని ఆదర్శ హిందీ మహా విద్యాలయంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. డీసీవో శ్రీనివాసరావు ఎన్నికల అధికారిగా ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తంగా 29మంది సభ్యులు పోటీలో ఉన్నారు. ఎన్నిక అనంతరం పాలకవర్గం ఏర్పాటవుతుంది.

Nizamabad Red Cross Elections | సొసైటీలో 9,826మంది సభ్యులు..

దశాబ్దాల కింద జిల్లాలో ప్రారంభమైన రెడ్​క్రాస్​సొసైటీలో ప్రస్తుతం 9,826 మంది సభ్యులు ఉన్నారు. పూర్తి సేవాభావంతో సేవలందించే ఈ స్వచ్ఛంద సేవాసంస్థ స్వయంప్రతిపత్తితో పనిచేస్తుంది. రాష్ట్రపతి గౌరవాధ్యక్షురాలిగా, రాష్ట్ర గవర్నర్​ అధ్యక్షుడిగా ఉంటారు. అలాగే జిల్లాస్థాయిలో కలెక్టర్​ దీనికి అధ్యక్షుడిగా కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు. అయితే ప్రభుత్వ పరంగా ఎలాంటి నిధులు రాకపోయినప్పటికీ ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే విరాళాలు.. మెంబర్​షిప్​ ఫీజులపైనే ఈ సేవాసంస్థ పనిచేస్తుంది.

Nizamabad Red Cross Elections | రక్తదాన శిబిరాలు.. తలసేమియా వార్డు..

ఖలీల్​వాడి రెడ్​క్రాస్​ సొసైటీ ఆధ్వర్యంలో తలసేమియా వార్డు ఏర్పాటైంది. ఇందులో ప్రస్తుతం 88మంది వ్యాధిగ్రస్తులకు రక్తం అందిస్తున్నారు. అలాగే వారికి ఉచితంగా మందులు,భోజనం, రానుపోను ఖర్చులు, ల్యాబ్​ ఖర్చులు సైతం రెడ్​క్రాస్​ భరిస్తోంది. సొసైటీ కార్యాలయంలో ఎస్​డీపీ మిషన్​ కూడా ఏర్పాటు చేశారు. సొసైటీ పరిధిలో ఇందల్వాయిలో వృద్ధాశ్రమం కూడా నిర్వహిస్తున్నారు. అలాగే వృద్ధుల కోసం ప్రణామ్​ కేర్​ సెంటర్ కూడా నిర్వహిస్తున్నారు.

Nizamabad Red Cross Elections | పోటాపోటీ ప్రచారాలు..

ఈ ఏడాది ఎన్నికలు రసవత్తరంగా జరుగనున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రెండు ప్యానెళ్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. బుస్సా ఆంజనేయులు ప్యానెల్​, ఇందూరు సేవా సమితి ప్యానెల్​ పేరుతో రెండు వర్గాలు పోటీలో ఉన్నాయి. అనుభవమున్న వారిని ఎన్నుకుంటే మరిన్ని సేవ కార్యక్రామాలు నిర్వహిస్తామని బుస్సా ప్యానెల్​ పేర్కొంటుంది. అలాగే కొత్త వారికి అవకాశమిస్తే ఉత్సాహంగా పనిచేస్తామని ఇందూరు సేవా సమితి ప్యానెల్​ సభ్యులు పేర్కొంటున్నారు. దీంతో ఎవరు గెలుస్తారోననే ఉత్కంఠ నెలకొంది.

Nizamabad Red Cross Elections, Indian Red Cross Society, Nizamabad News, Red Cross Society, Bussa Anjaneyulu, Induru Seva Samithi, Red Cross Voting, Nizamabad Elections

ఇది కూడా చదవండి: మరీ ఇంత నిర్లక్ష్యమా! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *