Nizamabad Turmeric Scam | పసుపు కొనుగోళ్లలో జీరో గోల్​మాల్​..రైతన్నల రక్తాన్ని పిండేస్తున్న దళారీ వ్యవస్థ..ఈ-నామ్ సాకుతో కోట్లలో దోపిడీ!

అధికారులు మాత్రం ఇది సాధారణ తనిఖీ అని, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో జరిగినట్లే ఇక్కడా జరుగుతోందని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nizamabad Turmeric Scam | చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక ఓ వైపు రైతన్న అల్లాడుతుంటే.. మరోవైపు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో అక్రమార్కులు, వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపారు.

పసుపు కొనుగోళ్ల పేరుతో సాగుతున్న ఈ ‘జీరో’ దందా ఇప్పుడు నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. ‘ఈ-నామ్’ (e-NAM 2.0) ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్, సర్వర్ సమస్యలను సాకుగా చూపిస్తూ రైతుల పొట్టగొడుతున్న వైనంపై ఎట్టకేలకు ఉన్నతాధికారులు నిద్రలేచారు.

Nizamabad Turmeric Scam | సాఫ్ట్‌వేర్ సాకు.. వ్యాపారులకు పండుగ!

గత సీజన్‌లో నిజామాబాద్ మార్కెట్ యార్డులో సాంకేతిక లోపాలు తలెత్తాయన్న నెపంతో ఈ-నామ్ ఆన్‌లైన్ విధానాన్ని పక్కనబెట్టారు. రైతుల ఇబ్బందులను తీరుస్తున్నామనే కలరింగ్ ఇస్తూ ‘ఓపెన్ ఆక్షన్’ (బహిరంగ వేలం) ప్రవేశపెట్టారు.

కానీ, ఇదే సాంకేతిక లోపాన్ని తమకు అనుకూలంగా మలచుకున్న మార్కెట్ అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై ‘జీరో’ కొనుగోళ్లకు తెరలేపారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే ఏకంగా లక్ష క్వింటాళ్ల పసుపును ఈ-నామ్ సాఫ్ట్‌వేర్‌ నమోదు లేకుండానే విక్రయించినట్లు తెలుస్తోంది.

Jeevan Reddy Janata Garage | ఆర్మూర్‌లో జీవన్​ రెడ్డి జనతా గ్యారేజ్ హంగామా..రీల్ రిపేర్లు ఎంత? రియల్ రాజకీయం ఎంత?

Nizamabad Turmeric Scam | ధరల్లో వ్యత్యాసం.. రైతుల పొట్టకోత!

ఓపెన్ ఆక్షన్ పేరుతో వ్యాపారులు, మధ్యవర్తులు ధరల వ్యత్యాసాలు చూపుతూ క్వింటాకు వేల రూపాయలు తక్కువ చేసి రైతులను నిలువునా ముంచేశారు.

ఒకవైపు మార్కెట్ ఫీజులకు గండి కొడుతూ, మరోవైపు రైతులకు దక్కాల్సిన మద్దతు ధరను దోచేసి తమ జేబులు నింపుకున్నారు. పసుపు రంగు మెరవాల్సిన రైతు జీవితాల్లో అధికారుల అవినీతి నల్లటి చీకట్లను నింపింది.

Nizamabad Turmeric Scam | ఆగ్రహించిన రైతన్న.. రణరంగమైన యార్డు!

దళారులు, అధికారుల దోపిడీని ప్రత్యక్షంగా చూసిన రైతన్నలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఏప్రిల్ సీజన్ లో తమకు న్యాయమైన ధర దక్కకపోవడంతో నిజామాబాద్ మార్కెట్ యార్డ్‌లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్యాలయ ఫర్నీచర్‌ను ధ్వంసం చేసే వరకు పరిస్థితి దారితీసిందంటే దళారీల వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

Hyderabad new flyovers | హైదరాబాద్‌లో ట్రాఫిక్ తీర్చేందుకు కొత్త ఫ్లైఓవర్లు..రూ. 368 కోట్లతో అనుమతులు మంజూరు..మరి ఆ కీలక ప్రాంతాల సంగతేంటి?

Nizamabad Turmeric Scam | విచారణతో అధికారుల గుండెల్లో గుబులు

రైతుల ఆగ్రహం, వరుస ఫిర్యాదులతో స్పందించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. డీసీవోతో పాటు ప్రత్యేక తనిఖీ బృందం మార్కెట్ కమిటీలో రికార్డులను జల్లెడ పడుతోంది.

అయితే, అధికారులు మాత్రం ఇది సాధారణ తనిఖీ అని, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో జరిగినట్లే ఇక్కడా జరుగుతోందని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఏది ఏమైనా, రైతుల కష్టాన్ని దోచుకున్న ఈ పెద్దమనుషుల బండారం త్వరలోనే బయటపడుతుందా? లేదా ఈ విచారణ కూడా కాగితాలకే పరిమితమవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *