అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jeevan Reddy Janata Garage | ఆర్మూర్ Armoor రాజకీయాలు ఇప్పుడు అసెంబ్లీ ప్రాంగణం నుంచి సోషల్ మీడియా తెరపైకి మారాయి. మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తనను తాను ఓ సామాజిక సంస్కర్తగా, స్థానిక “జనతా గ్యారేజ్” మెకానిక్‌గా అభివర్ణించుకుంటూ వరుస వీడియోల దాడి మొదలుపెట్టారు.
‘క్రైమ్ నంబర్’ పేరిట ఇప్పటికే 22 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ డిజిటల్ సిరీస్‌లో.. కాంగ్రెస్ నాయకుడు వినయ్ కుమార్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలే ప్రధాన లక్ష్యాలు కావడం గమనార్హం.
LIC Dividend | కేంద్ర ప్రభుత్వానికి ఎల్‌ఐసీ రూ.12,207 కోట్ల భారీ డివిడెండ్
అయితే, ఈ సుదీర్ఘ వీడియో సిరీస్ వెనుక స్థానిక నాయకుల అవినీతిని కడిగిపారేసే “నిజాయితీ స్ఫూర్తి” ఉందా? లేక అధికారం కోల్పోయిన తర్వాత మళ్లీ లైవ్లైట్లోకి రావడం కోసం ప్రదర్శిస్తున్న “అత్యుత్సాహం” ఉందా? లేదంటే ఉనికి కోసం పాకులాడుతున్నారా..? అనే చర్చ ఇప్పుడు ఆర్మూర్ చౌరస్తాలో జోరుగా సాగుతోంది.
Jeevan Reddy Janata Garage | స్క్రిప్ట్ బాగానే ఉంది..కానీ
జీవన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తున్న వీడియోలు చూస్తుంటే ఏదో పెద్ద క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతోంది. ‘క్రైమ్ నంబర్ 1’ నుంచి ‘22’ వరకు వరుసగా అంకెలు మారుతున్నాయి గానీ, అందులో ప్రజలకు దక్కుతున్న ఉపశమనం ఎంత అంటే ప్రశ్నే మిగులుతోంది.
కాంగ్రెస్, బీజేపీ నేతల అక్రమాలను వెలుగులోకి తెస్తున్నానంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు స్థానికంగా కొంత సంచలనం సృష్టిస్తున్న మాట నిజమే. ఎక్కడ నిర్లక్ష్యం జరిగినా, ఎవరు అక్రమాలకు పాల్పడినా ప్రశ్నించడం ప్రతిపక్ష నేతగా ఆయన హక్కు.
కానీ, పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఆర్మూర్ రోడ్లు, డ్రైనేజీలు, స్థానిక సమస్యల ‘గ్యారేజ్ రిపేర్లు’ ఎంతవరకు పూర్తయ్యాయో ప్రజలకు తెలియంది కాదు. అప్పట్లో లేని ఈ “గ్యారేజ్ విజన్”.. సీటు పోయాకే ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందన్న అస్త్రాలు నెటిజన్ల నుంచి ఎదురవుతున్నాయి.
Jeevan Reddy Janata Garage | సమరమా? ఉనికి పోరాటమా?
స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నిర్లక్ష్యాన్ని, కాంగ్రెస్ నేత వినయ్ కుమార్ రెడ్డి ప్రాభవాన్ని ఎండగడుతున్నానని జీవన్ రెడ్డి చెబుతున్నప్పటికీ, ఈ త్రికోణ సమరం వెనుక అసలు ఉద్దేశం వేరే ఉందనేది విశ్లేషకుల భావన.
Jeevan Reddy Janata Garage | సగటు ఆర్మూర్ పౌరుడి ప్రశ్న ఏమిటంటే..
“మీరు క్రైమ్ నంబర్లు వేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చూసి లైకులు కొట్టడానికి బాగుంది కానీ, మా వీధిలో మురుగు కాల్వల సమస్య, తాగునీటి సమస్య, రోడ్ల దుస్థితి తీరేదెప్పుడు? ఒకరు గ్యారేజ్ అంటారు, ఇంకొకరు అధికారంలో ఉండి పట్టించుకోరు… మా సమస్యలకు రిపేరు చేసే నాయకుడు ఎక్కడ?” అడుగుతున్నారు.
Jeevan Reddy Janata Garage | “రీల్” హీరోనా? “రియల్” నాయకుడా?
ఏది ఏమైనా, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ‘జనతా గ్యారేజ్’ ద్వారా ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం డిజిటల్ రాజకీయంలో కొత్త ట్రెండ్ సెట్ చేసి ఉండొచ్చు. నాయకుల నిర్లక్ష్యాన్ని, అక్రమాలను వెలికితీయడం ఆహ్వానించదగ్గ పరిణామమే అయినా, అది కేవలం ‘వ్యూస్, లైక్స్, రాజకీయ ఉనికి’ కోసమే పరిమితమైతే ప్రజలు త్వరలోనే ఈ సిరీస్‌ను ‘ఫ్లాప్’ చేయడం ఖాయమంటున్నారు.
రాజకీయాల్లో నిలదీతలు వీడియోలకే పరిమితం కాకుండా, ప్రజాక్షేత్రంలో పటిష్టమైన పోరాటంగా మారినప్పుడే ఆ ‘గ్యారేజ్’కి అసలైన విలువ ఉంటుంది.