అక్షరటుడే వెబ్‌డెస్క్: Noida Vehicle Ban | ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో గాలి కాలుష్యం తీవ్ర రూపం దాల్చడంతో అధికారులు ఆంక్షలను కఠినతరం చేశారు. పొల్యూషన్‌ను అదుపు చేసేందుకు గౌతమ్‌బుద్ధ నగర్ (నోయిడా) జిల్లాలో గ్రాప్-3 (GRAP-III) నిబంధనలను అమలులోకి తెచ్చారు. దీనివల్ల నోయిడాలోకి ప్రవేశించే బీఎస్-3 (BS-III), బీఎస్-4 (BS-IV) కేటగిరీ వాహనాలపై నిషేధం విధించారు. రవాణా శాఖ గణాంకాల ప్రకారం గౌతమ్‌బుద్ధ నగర్లో దాదాపు 1 లక్ష బీఎస్-4 వాహనాలు, 51 వేలకు పైగా బీఎస్-3 వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. ఈ నిర్ణయంతో దాదాపు 1.5 లక్షల వాహనాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడనుంది.
Noida Vehicle Ban | సరిహద్దుల్లో చెక్‌పోస్టులు..
ఆంక్షలు పక్కాగా అమలు అయ్యేలా చూడటానికి నోయిడాలోని వివిధ కీలక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు ట్రాఫిక్ డీసీపీ సయ్యద్ అలీ అబ్బాస్ తెలిపారు. జెవర్ టోల్ ప్లాజా, జీరో పాయింట్, పరీ చౌక్, చిల్లా బోర్డర్, డిఎన్డి (DND) ఫ్లైవేలతో పాటు ఢిల్లీ ( Delhi ), ఘాజియాబాద్, ఫరీదాబాద్ సరిహద్దుల్లో 24 గంటలూ పహారా కాస్తున్నారు. కాళింది కుంజ్, న్యూ అశోక్ నగర్, కొండ్లీ బోర్డర్ వంటి రద్దీ రూట్లలో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి గౌతమ్‌బుద్ధ నగర్ మీదుగా వెళ్లే వాహనాలను సైతం నిలిపివేస్తున్నారు.
Noida Vehicle Ban | నిబంధనలు ఉల్లంఘిస్తే ..
ప్రస్తుతానికి నిషేధిత కేటగిరీ వాహనాల్లో వస్తున్న డ్రైవర్లను ఆపి, తనిఖీల అనంతరం హెచ్చరించి వదిలేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే పదే పదే రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం వాహనాలను సీజ్ చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు. వాహనదారులంతా గ్రాప్-3 నిబంధనలకు సహకరించాలని కోరారు. అందువల్ల పాత కార్లు లేదా బైక్‌లపై బయటకు వెళ్లేముందు తమ వెహికల్ ఎమిషన్ స్టాండర్డ్స్ (Emission Standards) ఏంటో సరిచూసుకోవడం శ్రేయస్కరం.
Noida Vehicle Ban | ఈవీలు ఉండాల్సిందే..
ఇక నోయిడా నుంచి ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులకు కూడా ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిటీ (CAQM) నిబంధనల ప్రకారం ఢిల్లీలో బీఎస్-6 (BS-VI) కన్నా తక్కువ ప్రమాణాలు కలిగిన వాహనాల ఎంట్రీపై పూర్తి బ్యాన్ ఉంది. కేవలం బీఎస్-6, సీఎన్జీ (CNG), ఎలక్ట్రిక్ (EV), ఎల్ఎన్జీ (LNG) వాహనాలకు మాత్రమే ఢిల్లీలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బీఎస్-6 కంటే తక్కువ ప్రమాణాలు కలిగిన డీజిల్ బస్సులకు కూడా ఢిల్లీలోకి ప్రవేశం లేదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Arya Vaishya Women | శ్రీ వాసవి గ్రేటర్ ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ఎన్నిక