ORR Rash Driving | ‘రీల్స్’ పిచ్చి: ఓఆర్‌ఆర్‌పై 200 కి.మీ వేగంతో మృత్యు విన్యాసాలు.. యువకుడి అరెస్టు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ORR Rash Driving | లైకులు, కామెంట్ల కోసం సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి శృతిమించుతోంది. వ్యూస్ కోసం కొందరు తమ ప్రాణాలనే కాదు, తోటి వాహనదారుల ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు.

తాజాగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ఓ ప్రాతానికి చెందిన యువకుడు ఏకంగా గంటకు 200 కిలోమీటర్ల ప్రమాదకర వేగంతో కారు నడుపుతూ, దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఈ నిర్వాకానికి పాల్పడిన నిందితుడిని నార్సింగి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

ORR Rash Driving

ORR Rash Driving | అసలేం జరిగిందంటే..?

పోలీసుల కథనం ప్రకారం.. అల్కాపూర్ కాలనీకి చెందిన శ్రీకరింగుల సాయిరామ్ అనే యువకుడు ఈ నెల 19వ తేదీన నార్సింగి టోల్ ప్లాజా నుంచి అప్పా జంక్షన్ వైపు వెళ్తున్నాడు.

ఈ క్రమంలో తన కారును పరిమితికి మించి, ఏకంగా 200 కి.మీ వేగంతో నడిపాడు. అంతటితో ఆగకుండా, ఆ ప్రమాదకరమైన వేగాన్ని తన మొబైల్‌లో రికార్డ్ చేసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.

ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో తోటి వాహనదారులు, నెటిజన్లు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. అంత వేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పితే జరిగే ఘోర ప్రమాదాన్ని ఊహించుకుని జనం వణికిపోయారు.

ORR Rash Driving | పోలీసుల కొరడా.. కారు సీజ్

వైరల్ వీడియోపై స్పందించిన నార్సింగి పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడు సాయిరామ్‌ను గుర్తించి, ఆదివారం అతడిని అదుపులోకి తీసుకున్నారు.

నిర్లక్ష్యంగా, ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా వాహనం నడిపినందుకు అతడిపై కేసు నమోదు చేసి, సదరు లగ్జరీ కారును సీజ్ చేశారు.

ORR Rash Driving |  ‘లైకుల’ వేటలో ‘లైఫ్’ రిస్క్ ఎందుకు?

ఈ ఘటన కేవలం ఒక ట్రాఫిక్ ఉల్లంఘన మాత్రమే కాదు.. సమాజంలో మారుతున్న యువత వికృత పోకడలకు అద్దం పడుతోంది.

ఓఆర్‌ఆర్‌పై వేగ పరిమితి గరిష్టంగా 100-120 కి.మీ మాత్రమే. కానీ, దానికి రెట్టింపు వేగంతో వెళ్లడం ముమ్మాటికీ నేరమే. చిన్నపాటి పొరపాటు జరిగినా కారు గాల్లోకి లేచి, వెనుక వచ్చే అమాయక ప్రయాణికుల ప్రాణాలు సైతం బలితీసుకునే ప్రమాదం ఉంది.

కేవలం జరిమానాలు, చిన్నపాటి సెక్షన్లతో సరిపెట్టకుండా.. ఇలాంటి ‘సోషల్ మీడియా స్టంట్స్’ చేసేవారి డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేయాలి.

యువతకు ఖరీదైన కార్లు, బైకులు కొనిచ్చే తల్లిదండ్రులు.. వారు రోడ్లపై ఏం చేస్తున్నారనే దానిపై కూడా ఓ కన్నేసి ఉంచాలి.

ORR Rash Driving | నార్సింగి సీఐ హెచ్చరిక

“రోడ్లపై మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ, ప్రాణాంతక విన్యాసాలకు పాల్పడే వారిపై చట్టపరంగా అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయి. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తే సహించేది లేదు.”

రహదారులు ప్రయాణించడానికి, గమ్యస్థానాలకు సురక్షితంగా చేరడానికి.. అంతేకాని రేసింగ్‌లు, రీల్స్ చేసుకోవడానికి కాదు. యువత ఇప్పటికైనా ఈ ‘వ్యూస్’ పిచ్చి నుంచి బయటపడి, బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోతే.. జైలు జీవితం లేదా ప్రాణాలు కోల్పోవడం ఖాయమనే నిజాన్ని గ్రహించాలి.

Varalakshmi Controversial Comments | మగాడు కేవలం ‘స్పేర్ పార్ట్’ మాత్రమేనా?…..

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *