అక్షరటుడే, కామారెడ్డి : Paddy Cultivation | ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సరిగా పడవని.. వరి సాగు చేయొద్దని అధికారులు సూచించారు. ఆరుతడి పంటలు వేసుకోవాలని అవగాహన కల్పించారు. అయినా కూడా జిల్లాలో రైతులు వరి వైపు మొగ్గు చూపారు. ప్రతి ఏటా సాగుచేసే పంట కావడంతో రిస్క్ తక్కువ అనే ఉద్దేశంతో వరి నాట్లు వేశారు. వరి తర్వాత అత్యధికంగా సోయాబీన్ పంటకు రైతులు (Farmers) ప్రాధాన్యత ఇచ్చారు. అయితే వరిపంటలో ఎక్కువ శాతం సన్నరకం సాగుపై అత్యధిక దృష్టి సారించారు.
జిల్లాలో వరినాట్లు పూర్తయ్యాయి. మొదట్లో వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. అయితే జులై చివర్లో వర్షాలు పడటంతో వరి నాట్లు పూర్తి చేశారు. ఆగస్టు 17వ తేదీ నాటికి జిల్లా వ్యవసాయ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 25 మండలాల్లో కలిపి 3.14లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ప్రభుత్వం 3.9 లక్షల ఎకరాల్లో వరి వేస్తారని అంచనా వేయగా.. అంచనాకన్నా 4,776 ఎకరాలు అధికంగా వరి వేశారు. అత్యధికంగా గాంధారి, జుక్కల్ మండలాల్లో వరిపంట సాగైంది.
Paddy Cultivation | కరుణించిన వరుణుడు
ఎల్నినో ప్రభావంతో సీజన్ ప్రారంభంలో వర్షాలు పడలేదు. జులై 20 తర్వాత వరుణుడు కరుణించాడు. మిగతా జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు అయినా.. కామారెడ్డిలో మాత్రం సాధారణం కంటే అధిక వర్షాలు పడ్డాయి. దీంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. చెరువులు నిండుకుండల్లా మారాయి. దీంతో రైతులు వరి వేశారు. ఆగస్టు నాటికి జిల్లాలో 534 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 662 మి.మీ నమోదైంది. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పొంగి పొర్లాయి.
Paddy Cultivation | ఆదరణ తక్కువ
ఆరుతడి పంటల విషయంలో మాత్రం రైతుల ఆసక్తి అంతంత మాత్రంగానే ఉంది. జొన్న 8 ఎకరాలు, చిరుధాన్యాలు 20 ఎకరాల్లోనే సాగయ్యాయి. పెసర 2,198 ఎకరాలు, మినుము 1,851 ఎకరాలకు పరిమితమైంది. మార్కెట్లో ధరలు స్థిరంగా లేకపోవడం, గిట్టుబాటు తక్కువగా ఉండటం వల్ల రైతులు ఈ పంటలపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
Paddy Cultivation | వాణిజ్య పంటలపై ఆసక్తి
వరికి బదులుగా సోయాబీన్, పత్తి, మొక్కజొన్న వంటి వాణిజ్య పంటల సాగుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. సోయాబీన్ 87,736 ఎకరాలతో జిల్లాలో రెండవ అతిపెద్ద పంటగా నిలిచింది. మద్నూర్ 24,200 ఎకరాలు, జుక్కల్ 17,850 ఎకరాలు, బిచ్కుంద 14,955 ఎకరాలతో ముందున్నాయి. గతేడాదితో పోలిస్తే సోయా విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రైతులు సన్నరకం వరి సాగు చేశారు. 2.51 లక్షల ఎకరాల్లో సన్న రకాలు సాగైనట్టుగా వ్యవసాయ శాఖ పేర్కొంది. మార్కెట్లో సన్న బియ్యానికి మంచి ధర రావడం, ప్రభుత్వ కొనుగోళ్లలో ప్రాధాన్యత ఉండటం, ఎగుమతులకు డిమాండ్ ఉండటంతో వీటిని సాగు చేశారు.
ఇది కూడా చదవండి..: Riyadh Jail Release | రూ.84లక్షలు ఇస్తేనే విడుదల.. రియాద్ జైలులో బోధన్ యువకుడి నరకయాతన