అక్షరటుడే,ఆర్మూర్: Transformer Coil Theft | ట్రాన్స్ఫార్మర్లలో రాగి కాయిల్స్ చోరీ(Copper Coil Theft) చేస్తున్న ఆరుగురు నిందితుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు పట్టణంలోని(Armoor Police station) పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన విలేరుల సమావేశంలో సీపీ సాయిచైతన్య వివరాలు వెల్లడించారు.
Transformer Coil Theft | ఆర్మూర్‌కు చెందిన..
ఆర్మూర్ పోచమ్మ గల్లీకి చెందిన అన్నదమ్ములు కర్రే వినోద్ కుమార్, కర్రె విజయ్‌తో పాటు అండ్రాసి నవీన్, గుంబోల్ల ఈశ్వర్, బాజ హరిప్రసాద్, మూల దుర్గాప్రసాద్ రెడ్డి ముఠాగా ఏర్పడ్డారు. పాత ఇనుప సామాన్లు సేకరిస్తూ ఆర్మూర్ పట్టణంలోని స్క్రాప్ వ్యాపారి అబ్దుల్ వసీం అలియాస్ తిల్లి బాబాకు విక్రయిస్తుండేవారు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. ఆరుగురు తిల్లిబాబా సలహా మేరకు పాత ఇనుప సామగ్రి వ్యాపారం పేరుతో గ్రామాల్లో సంచరిస్తూ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించేవారు. వేల్పూర్, బాల్కొండ, మెండోరా, భీంగల్, ఆర్మూర్, ఏర్గట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో రాత్రివేళ ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగి కాయిల్స్ దొంగిలించి అతడికే విక్రయించేవారు.
Transformer Coil Theft | నిందితులపై 19 కేసులు
నిందితులపై వేల్పూర్‌లో 4, బాల్కొండలో 5, మెండోరలో 3, భీమ్‌గల్‌లో 1, ఆర్మూర్‌లో 5, ఏర్గట్లలో 1 చొప్పున మొత్తం 19 కేసులున్నాయని సీపీ తెలిపారు. అబ్దుల్ వసీం పైనా గతంలో చోరీ సొత్తు కొన్న కేసులు ఉన్నాయన్నారు. ఉదయం పడగల్ గ్రామశివారు పాత బీటీ రోడ్, పసుపు బోర్డు సమీపంలోని రైల్వే బ్రిడ్జ్ వద్ద ఆరుగురితో పాటు ఆర్మూర్‌లో అబ్దుల్ వసీంను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి బజాజ్ మాక్సిమా ట్రాలీ ఆటో, బజాజ్ డిస్కవర్ బైక్, 5 మొబైల్ ఫోన్లు, చోరీకి ఉపయోగించిన పనిముట్లు, 74 కిలోల రాగి తీగను స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో, కాలనీల్లో ఎవరైన అనుమానితులు తిరుగతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా సీపీ తెలిపారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ సుదన్ నాగోలే, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్‌హెచ్‌వో సత్య నారాయణ గౌడ్, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు.