అక్షరటుడే, కామారెడ్డి: Student Protest | వెయ్యి మంది విద్యార్థులకు పది తరగతి గదులు ఉంటే ఎక్కడ చదువుకోవాలి అంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో నిజాంసాగర్ చౌరస్తాలో బైఠాయించారు.
Student Protest | 500మంది విద్యార్థులతో భారీ ర్యాలీ
కళాశాల విద్యార్థులు కళాశాల నుంచి కొత్తబస్టాండ్ మీదుగా నిజాంసాగర్ చౌరస్తా వరకు సుమారు 500 మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నిజాంసాగర్ (Nizamsagar) చౌరస్తాలో బైఠాయించి నిరసన తెలిపారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికి అందుకు అనుగుణంగా గదులు లేవన్నారు. అదనపు గదులు ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. గదులు లేక చెట్ల కింద, వరండాలో చదువుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు వినయ్ కుమార్ మాట్లాడుతూ.. కళాశాలలో నెలకొన్న సమస్యలపై అనేక సార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించామన్నారు. అయినా ఇప్పటికి వసతులు కల్పించడంలో విఫలం అయ్యారన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రత్యేక దృష్టి సారించి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అదనపు గదులు మంజూరు చేసి విద్యార్థుల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోతే విద్యార్థులతో కలిసి నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: Paddy Cultivation | వద్దన్నా.. వరి సాగు చేసిన రైతులు