అక్షరటుడే, ఎల్లారెడ్డి: Paddy Grain Demand | వరి ధాన్యానికి ఈసారి భారీ డిమాండ్ ఏర్పడింది. ఖరీఫ్ సీజన్లో కామారెడ్డి (Kamareddy), నిజామాబాద్ జిల్లాల్లో వరిసాగు ఆశాజనకంగా ఉండడంతో పంట చేతికొచ్చే సమయానికి వ్యాపారులు ముందుగానే రంగంలోకి దిగారు. ఇతర జిల్లాల్లో వరి సాగు విస్తీర్ణం తగ్గడంతో ధాన్యం లభ్యత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్న వ్యాపారులు.. ముందుగానే రైతులతో ఒప్పందాలు చేసుకునేందుకు గ్రామాల బాట పడుతున్నారు. కొందరు రైతులకు అడ్వాన్సులు చెల్లిస్తూ ధాన్యాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Paddy Grain Demand | మద్దతు ధరకు మించి..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకముందే ప్రైవేట్ వ్యాపారులు రైతుల వద్దకు చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లో సూర్యాపేట, వర్ని, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాలకు చెందిన రైస్‌మిల్లర్లు గ్రామాల్లో రైతులను కలిసి ధాన్యం కొనుగోలుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో క్వింటాలుకు సుమారు రూ.3,100 వరకు పచ్చి వడ్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. వారం రోజుల పాటు చెల్లింపును వాయిదా వేసేందుకు రైతులు అంగీకరిస్తే క్వింటాలుకు రూ.3,200 వరకు చెల్లించేందుకు వ్యాపారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Paddy Grain Demand | కొనుగోలు కేంద్రాల కంటే..
దీంతో ఈసారి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం తీసుకెళ్లడం కంటే.. వ్యాపారులే రైతుల పొలాల వద్దకు వచ్చి కొనుగోలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. రానున్న రోజుల్లో డిమాండ్ మరింత పెరిగితే ధరలు ఇంకాస్త పెరిగే అవకాశముందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందన్న హెచ్చరికలు రైతుల్లో ఆందోళన కలిగించాయి. ఖరీఫ్ సీజన్లో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటలపై రైతులు ఆశలు వదులుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే అనంతరం వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులతో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు ఆశాజనకంగా కురిశాయి. దీంతో వరితో పాటు ఇతర పంటలు కూడా మంచి దిగుబడులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
Paddy Grain Demand | నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో..
నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో సుమారు 4,35,806 ఎకరాల్లో వరి సాగు చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి పంటకోత దశకు చేరుకుంది. దీంతో మిల్లర్లు, వ్యాపారులు ముందుగానే ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సారిస్తున్నారు. అలాగే కామారెడ్డి జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో 3,19,361 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 1,09,967 ఎకరాల్లో సన్న ధాన్యం, సుమారు 2.10 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం ధాన్యం సాగైంది. రెండేళ్ల క్రితం వరకు సన్నాల సాగు 60 వేల ఎకరాలు దాటకపోగా.. ప్రభుత్వం సన్న ధాన్యానికి అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించడంతో ఈసారి రైతులు భారీగా సన్న రకాలను సాగు చేశారు. అధికారుల అంచనాల ప్రకారం ఎకరాకు సగటున 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తే.. జిల్లాలో సుమారు 2.35 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.
Paddy Grain Demand | బోనస్ కోసం రైతుల ఎదురుచూపులు
సన్న ధాన్యానికి ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించినప్పటికీ గత యాసంగి సీజన్‌కు సంబంధించిన బోనస్ డబ్బులు ఇంకా అందకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. గత యాసంగిలో సుమారు 28,326 మంది రైతుల నుంచి సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మద్దతు ధరకు సంబంధించిన నగదు రైతుల ఖాతాల్లో జమ అయినప్పటికీ.. బోనస్ డబ్బుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ వానాకాలం సీజన్లోనైనా ప్రభుత్వం సన్న ధాన్యానికి ప్రకటించిన బోనస్‌ను సకాలంలో చెల్లిస్తుందా? లేదా? అనే సందేహం రైతుల్లో నెలకొంది.
Paddy Grain Demand | తెగుళ్లతో సన్నాలకు దెబ్బ
మరోవైపు జిల్లాలో సన్న ధాన్యం పంటకు తెగుళ్ల బెడద రైతులను కలవరపెడుతోంది. ముఖ్యంగా అగ్గి తెగులు, పచ్చదోమ వంటి తెగుళ్లు సోకుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం పంట పోత దశలో ఉండటంతో దిగుబడిపై ప్రభావం పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. మరికొద్ది రోజుల్లో కోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
Paddy Grain Demand | ధర మరింత పెరిగేనా?
ఇతర జిల్లాల్లో వరి సాగు తగ్గడం, కామారెడ్డి–నిజామాబాద్ జిల్లాల్లో ధాన్యం దిగుబడులు ఆశాజనకంగా ఉండడం, మిల్లర్ల నుంచి ముందుగానే డిమాండ్ రావడం వంటి పరిణామాలతో ధాన్యం ధరపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం క్వింటాలుకు రూ.3,100 వరకు పలుకుతున్న ధర.. చెల్లింపుల విషయంలో రైతులు కొంత గడువు ఇస్తే రూ.3,200 వరకు చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యేలోపే ప్రైవేట్ వ్యాపారులు రైతుల వద్దకు చేరుకోవడం.. ఈసారి వరి ధాన్యానికి ఉన్న డిమాండ్‌కు అద్దం పడుతోంది.
Paddy Grain Demand | మద్దతు ధరకు మించి ప్రైవేటు కొనుగోళ్లు..
ప్రభుత్వ మద్దతు ధరతో పోలిస్తే ప్రైవేటు వ్యాపారులు వరి ధాన్యానికి భారీగా ధర చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. సన్న రకం వరికి ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,461, బోనస్ 500, కలిపి రూ.2,961 చెల్లిస్తుండగా, ప్రైవేటు మార్కెట్లో రూ.3,200 నుంచి రూ.3500 వరకు ధర పలుకుతోంది. దీంతో ప్రభుత్వ ధరతో పోలిస్తే రైతులకు క్వింటాలుకు రూ.500 వరకు అదనంగా లభించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: AI in Police Department | పోలీస్ శాఖలో ఏఐ వినియోగం మరింత విస్తృతం చేయాలి