Paddy Procurement Crisis | కామారెడ్డిలో ధాన్యం కొనుగోళ్ల సంక్షోభం.. బలి అవుతున్న కిందిస్థాయి అధికారులు

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Paddy Procurement Crisis | కామారెడ్డి(Kamareddy) జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు తీవ్ర జాప్యం కావడంతో అన్నదాతల సహనం నశించి కన్నెర్ర చేస్తున్నారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్దే రేయింబవళ్లు కాపలా కాస్తున్న రైతుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. మొన్న రామారెడ్డి(Ramareddy) మండలంలో, నిన్న ఎల్లారెడ్డిలో, నేడు నాగిరెడ్డిపేట్ మండలంలో రైతులు ఆగ్రహంతో రోడ్డెక్కుతున్నారు.

Paddy Procurement Crisis | క్షేత్రస్థాయిలో అధికారులే బలి..

జిల్లాస్థాయి అధికారులు పర్యవేక్షణ లోపం వల్లే ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతుందని.. ఆదేశాలు ఇవ్వడం తప్ప అమలు చేయడంలో విఫలం అవుతున్నారని అధికారులను రైతులు విమర్శిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో(procurement centers) జరుగుతున్న పరిస్థితులను స్వయంగా పరిశీలించి దానికి అనుగుణంగా ఏర్పాటు చేస్తే అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం తరలించే అవకాశాలు ఉంటాయని అన్నదాతలు పేర్కొంటున్నారు.

Paddy Procurement Crisis | లారీలు రాక పేరుకుపోతున్న ధాన్యం కుప్పలు..

జిల్లా కేంద్రం నుంచి లారీలు రాకపోవడంతో తరలింపు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలు కుప్పలుగా ధాన్యం పేరుకుపోతోంది. రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే స్థానిక మండల, డివిజన్ స్థాయి అధికారులు వచ్చి హామీలు ఇచ్చి వెళ్లడం తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు లేవు. చెప్పిన మాటలు నెరవేరకపోవడంతో ఇప్పుడు రైతులకు ముఖం చాటేసే దుస్థితికి అధికారులు చేరుకున్నారు. ప్రణాళిక లోపం వల్లే కొనుగోళ్లలో ఈ జాప్యం జరుగుతోందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి.

Paddy Procurement Crisis | అకాల వర్షాలతో తడిసి ముద్దవుతున్న పంట

ఒకపక్క అకాల వర్షాలు కురుస్తుండటంతో ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం తడిసి మొలకలు వచ్చే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని తేమ శాతం (Moisture percentage) పేరుతో తిరస్కరిస్తారేమోనని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పంటను కాపాడుకునేందుకు టార్పాలిన్లు, గోనె సంచులు కొనేందుకు అదనంగా ఖర్చు భరించాల్సి వస్తోందని వాపోతున్నారు.

Paddy Procurement Crisis | ఆగ్రహంతో పంటలకు నిప్పు

కొనుగోళ్లు, బస్తాల తరలింపుపై విసిగివేసారిన కర్షకులు తమ నిరసనను వినూత్నంగా వ్యక్తం చేస్తున్నారు. ‘పంటలు పండించే బదులు దహనం చేయడమే ఉత్తమం’ అని ఆవేదనతో తమ సొంత ధాన్యం కుప్పలకు నిప్పు పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో కానీ, అధికారుల్లో కానీ చలనం లేదు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్న రైతులను చూసి ‘అయ్యో పాపం’ అని పరామర్శించడంలో కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమవుతున్నారని రైతు సంఘాలు మండిపడుతున్నాయి.

 మిల్లుల వద్ద అన్‌లోడింగ్ జాప్యం

రైస్ మిల్లుల(Rice mills) వద్ద కూడా అన్‌లోడింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది. లేబర్ కొరత కారణంగా లారీలు మిల్లుల వద్దే రోజుల తరబడి నిలిచిపోతున్నాయి. దీంతో కొనుగోలు కేంద్రాలకు లారీలు రావడం లేదు. మిల్లులకు కఠిన ఆదేశాలు జారీ చేసి, లేబర్‌ను అధికంగా పెట్టుకుని లారీలు తొందరగా అన్‌లోడ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

 రైతుల సూచనలు – ఆర్టీసీ కార్గో బస్సుల వినియోగం

గతంలో మాదిరిగా లారీలతో పాటు ఆర్టీసీ కార్గో బస్సులను సైతం ధాన్యం తరలింపుకు వినియోగిస్తే సమస్యకు కొంతమేర పరిష్కారం లభిస్తుందని రైతులు సూచిస్తున్నారు. అలాగే ప్రతి మండలానికి ప్రత్యేకంగా లారీల కోటా కేటాయించి, జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షించాలని కోరుతున్నారు. అంతేకాకుండా గతంలో అధికారులు సైతం రోడ్లపై ఉంటూ వచ్చే వాహనాలను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి బస్తాలను తరలించే ఏర్పాటు సైతం చేసేవారని ఇప్పుడు అలాంటి మాటే లేకుండా పోయిందని అన్నదాతలు వాపోతున్నారు.

ఆదేశాలు మాత్రమే.. ఆచరణ శూన్యం

లారీల కొరత, మిల్లుల వద్ద అన్‌లోడింగ్ జాప్యం, ప్రణాళికా లోపం వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని స్వయంగా అధికారులే అంగీకరిస్తున్నారు. జిల్లాస్థాయి నుంచి ఆదేశాలు జారీ చేయడం తప్ప వాటిని క్షేత్రస్థాయిలో ఆచరణలో పెట్టడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. కొనుగోలు కేంద్రాలకు లారీలు పంపించడంలో, మిల్లుల వద్ద లేబర్‌ను పెంచి అన్‌లోడింగ్ వేగవంతం చేయడంలో చిత్తశుద్ధి లోపించిందని రైతులు ఆరోపిస్తున్నారు.

 రైతు సంఘాల హెచ్చరిక

జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుని ధాన్యం కొనుగోళ్లు, తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతు సంఘాల జేఏసీ డిమాండ్ చేస్తోంది. తడిసిన ధాన్యానికి కూడా మద్దతు ధర చెల్లించి, రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతోంది. లేకపోతే జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, రాస్తారోకోలు చేపడతామని, కలెక్టరేట్ ముట్టడికి సైతం వెనుకాడబోమని హెచ్చరించింది. రైతుల ఆగ్రహ జ్వాలలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Assam UCC Bill | దేశంలో మూడో రాష్ట్రంగా అస్సాం.. ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *