అక్షరటుడే, కామారెడ్డి : Corporation Chairman Posts | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో పదవుల పందేరం మొదలైంది. గత కొంతకాలంగా నామినేటెడ్, కార్పోరేషన్ పదవుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆశావహులకు ఇప్పుడు అవకాశం కలిసొచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ముఖ్య నాయకుల చుట్టూ ఆశావహులు ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో చైర్మన్ పదవులు కావడంతో పోటీ తీవ్రంగా ఉంటుందన్న టాక్ వినిపిస్తున్న తరుణంలో పదవి ఎవరికి దక్కుతుందోనన్న చర్చ సాగుతోంది.
రాష్ట్రంలోని నాలుగు కార్పొరేషన్ల పదవీకాలం నేటితో ముగిసింది. దీంతో ఆయా పదవుల్లో కొనసాగుతున్న ఛైర్మన్లు బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. కొత్త నియామకాల ప్రక్రియ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ వర్గాల్లో కదలిక మొదలైంది. ఇప్పటికే పదవుల్లో కొనసాగిన వాళ్లు తిరిగి అదే పదవి తీసుకోవడానికి అంతగా ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం సాగుతోంది. దాంతో వారిని పార్టీలో క్రియాశీలకంగా పని చేసేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు రాజకీయవర్గాలు భోగట్టా..
Corporation Chairman Posts | ఉమ్మడి జిల్లాకే నాలుగు కార్పొరేషన్ పదవులు
రాష్ట్రస్థాయి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులలో నాలుగు ఛైర్మన్లు ఉమ్మడి జిల్లాకు దక్కాయి. ఇప్పటి దాకా జిల్లా నుంచి వీరికే గత మూడేళ్లుగా ఉమ్మడి జిల్లా నుంచి నాలుగు కీలక కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం లభించింది. ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కాసుల బాలరాజు, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా అన్వేష్ రెడ్డి, సహకార సంఘాల ఛైర్మన్‌గా మానాల మోహన్ రెడ్డి, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఈరవత్రి అనిల్ విధులు నిర్వర్తించారు. ఇప్పుడు వీరి పదవీకాలం పూర్తికావడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి.
Corporation Chairman Posts | నలుగురిలో ఇద్దరు మహిళలు..?
కొత్త నియామకాల కోసం ఉమ్మడి జిల్లా నుంచి పలువురు నేతలు అధిష్టానం వద్ద పైరవీలు చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం నలుగురు ప్రధాన ఆశావహులు రేసులో ఉన్నట్లు సమాచారం. వారిలో ఇద్దరు మహిళలు ఉండటం గమనార్హం. మహిళలకు, యువ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న పార్టీ విధానం నేపథ్యంలో ఈసారి జాబితాలో మార్పులు ఉండొచ్చని చర్చ జరుగుతోంది. పదవులు ఆశించే వారిలో కామారెడ్డి డీసీసీ మాజీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి దేవరాజు గౌడ్‌తో పాటు మహిళల కోటాలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ గడ్డం ఇందుప్రియ, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబను గడ్డం ఇందుప్రియ కలిశారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఏఐసీసీ అసెంబ్లీ కో-ఆర్డినేటర్ ఘన్ రాజ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు చర్చ సాగుతోంది.
Corporation Chairman Posts | కష్టపడే వారికే పదవులు..
గత ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన వారికి, నియోజకవర్గాల్లో యాక్టివ్‌గా ఉన్న నేతలకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. ప్రజల్లో గుర్తింపు ఉన్నవారికి, పార్టీ బలోపేతానికి పనిచేసే వారికి ఈసారి పదవులు కట్టబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎవరెవరికి దక్కుతాయని ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.
Corporation Chairman Posts | కొనసాగుతున్న సస్పెన్స్

ఒకే జిల్లా నుంచి 4 కార్పొరేషన్లు రావడం గతంలో అరుదు. అందుకే ఈసారి కూడా కామారెడ్డి జిల్లాకు ఎన్ని సీట్లు దక్కుతాయన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కుల సమీకరణాలు, ప్రాంతీయ బ్యాలెన్స్, సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఆశావహులు ఢిల్లీ, హైదరాబాద్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా తమకు అవకాశం ఇవ్వాలని ఆర్జి పెట్టుకుంటున్నట్టుగా ప్రచారం సాగుతోంది.
Corporation Chairman Posts | నేటితో ముగిసిన పదవీకాలం..
నేటితో నాలుగు కార్పొరేషన్ల పదవీకాలం అధికారికంగా ముగిసింది. వారం, పది రోజుల్లో కొత్త ఛైర్మన్ల పేర్లను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. అప్పటివరకు కార్పొరేషన్ దక్కేదెవరికో అన్నది జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలవనుంది. నాయకులు మాత్రం తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. కార్పొరేషన్ పదవి చేపట్టి తమ కలను సాకారం చేసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీ అధిష్టానం ఆశీస్సులు ఎవరికి దక్కుతాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఇది కూడా చదవండి..: Nizamabad Murder | నిజామాబాద్ జిల్లాలో దారుణం.. వ్యక్తిని హత్య చేసిన కుటుంబీకులు