అక్షరటుడే, డిచ్పల్లి : Paddy Procurement Delay | ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకు చివరకు కన్నీళ్లే మిగులుతున్నాయి.. పంట చేతికొచ్చే సమయంలో ధరలు ఆశలు రేపి.. విక్రయించే సమయానికి అదే ధరలు పాతాళానికి పడిపోతున్నాయి. ఒకవైపు వ్యాపారుల సిండికేట్, మరోవైపు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వహణలో జాప్యం.. వెరసి అన్నదాత పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది.
సీజన్ ప్రారంభంలో క్వింటాలు పచ్చి వడ్లకు రూ.3,700 వరకు ధర చెల్లించిన వ్యాపారులు.. ఇప్పుడు ఎండబెట్టిన ధాన్యానికి సైతం రూ.2,700 ఇచ్చేందుకు ముప్పుతిప్పలు పెడుతున్న పరిస్థితి. ధరల పతనంతో రైతుల (Farmers) ఆశలు ఆవిరవుతుండగా.. కొనుగోలు కేంద్రాలు కాగితాలకే పరిమితమయ్యాయని మండిపడుతున్నారు.
Paddy Procurement Delay | ఆదిలో ఆశలు.. ఇప్పుడు ఆవేదన!
వానాకాలం వరికోతలు ప్రారంభమైన గత నెలలో ధాన్యం ధరలు రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తించాయి. పచ్చి వడ్లకు క్వింటాల్‌కు రూ.3,600 వరకు ధర పలకడంతో ఈసారి వరి సాగు చేసిన రైతులకు మంచి గిట్టుబాటు లభిస్తుందని భావించారు. స్థానిక దళారులతో పాటు పక్క రాష్ట్రాల వ్యాపారులు సైతం నేరుగా రైతుల పొలాల వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. సుమారు 20రోజుల పాటు రూ.3,500 నుంచి రూ.3,700 మధ్య ధరలు కొనసాగడంతో రైతుల్లో ఉత్సాహం నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పంటకు మంచి ధర లభిస్తోందని సంబరపడ్డారు. కానీ ఈ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. పంట కోతలు ముమ్మరమై ఎక్కువ మొత్తంలో ధాన్యం మార్కెట్లోకి వస్తున్న సమయంలో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. మొన్నటివరకు పచ్చి వడ్లకే రూ.3,300 వరకు చెల్లించిన వ్యాపారులు.. ప్రస్తుతం ఎండబెట్టిన ధాన్యానికి క్వింటాలుకు రూ.2,700 చెల్లించేందుకు కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ శాతం, నాణ్యత, రవాణా ఖర్చుల పేరుతో ధరను మరింత తగ్గిస్తున్నారని
వాపోతున్నారు.
Paddy Procurement Delay | వ్యాపారుల సిండికేట్‌తో ధరలకు కళ్లెం..
ధాన్యం ధరల పతనం వెనుక వ్యాపారుల సిండికేట్ ఉందనే అనుమానాలు రైతుల్లో బలంగా వ్యక్తమవుతున్నాయి. మొదట్లో పోటీపడి అధిక ధరలు చెల్లించిన వ్యాపారులు.. ప్రస్తుతం అంతా ఒక్కతాటిపైకి వచ్చి తక్కువ ధరలకే ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒక వ్యాపారి చెప్పిన ధరకు మరో వ్యాపారి ధర పెంచి కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులకు పొంతన ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దసరా పండుగకు ముందే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు నాయకులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేశారు. కానీ ప్రారంభించిన కేంద్రాల్లో వాస్తవంగా కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభమవుతాయన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.
Paddy Procurement Delay | కల్లాల్లోనే ధాన్యం..
వరి కోతలు పూర్తిచేసి ధాన్యాన్ని ఆరబెట్టి కుప్పలుగా పోసి దాదాపు నెల రోజులు కావస్తున్నా కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యాన్ని కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కల్లాల్లో ధాన్యం నిల్వ ఉండటంతో రాత్రింబవళ్లు కాపలా కాయాల్సిన పరిస్థితి నెలకొంది. పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చాల్సి ఉంది. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, కూలీల ఖర్చులు, ట్రాక్టర్ బాడుగలు, కోత యంత్రాల ఖర్చులు అన్నీ రైతులపై భారంగా మారాయి.
Paddy Procurement Delay | పర్యవేక్షణ ఏదీ?
ప్రభుత్వం తరఫున కాంటాలు ప్రారంభించకపోవడం కారణం రైస్ మిల్లుల అలాట్మెంట్ లేకపోవడమే అని తెలుస్తోంది. చాలా ఏళ్లుగా సీఎంఆర్ బకాయిలు ఉండటంతో రైస్ మిల్లర్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో కేసులు నమోదు చేసింది. దీంతో రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపులు ఆగిపోయిన పరిస్థితి. ఈ క్రమంలో కాంటాలు ప్రారంభించడం లేదనే రైతులు చర్చించుకుంటున్నారు. ధాన్యం ధరలు రోజురోజుకూ పడిపోతున్నా సంబంధిత మార్కెటింగ్, పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులు పరిస్థితిని ఎంతవరకు పర్యవేక్షిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి..: Teacher Suspension Warning | ఉపాధ్యాయులు సమాచారం లేకుండా గైర్హాజరైతే సస్పెన్షనే..: కలెక్టర్ ఇలా త్రిపాఠి