అక్షరటుడే వెబ్‌డెస్క్: Pending Traffic Challans | ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినప్పుడు పడే చలాన్లను చూసీచూడనట్లు వదిలేస్తున్నారా? ‘ఏముందిలే.. తర్వాత చూసుకుందాం’ అని నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే ఈ వార్త కచ్చితంగా మీకోసమే. ఇకపై పెండింగ్ చలాన్లు చెల్లించకపోతే వాహనాలు సీజ్ చేయడంతో పాటు, ఆన్లైన్ సేవలను పూర్తిగా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ( Supreme Court ) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Pending Traffic Challans | సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..
దేశవ్యాప్తంగా జారీ అవుతున్న ట్రాఫిక్ చలాన్లలో దాదాపు 47 శాతం వరకు పెండింగ్‌లోనే ఉండటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జస్టిస్ జె.బి. పార్డీవాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. కేవలం చలాన్లు విధిస్తే సరిపోదని, వాటిని వసూలు చేయడంలో కఠిన చర్యలు ఉండాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ-చలాన్ల రూపంలో రూ. 49,194 కోట్లు రావాల్సి ఉండగా.. కేవలం రూ. 26,175 కోట్లు మాత్రమే వసూలయ్యాయని, మిగతా భారీ బకాయిలు అలాగే పేరుకుపోయాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అధికారులు ఇకపై ర్యాండమ్ చెక్స్ నిర్వహించి, పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలను వెంటనే సీజ్ చేయాలని ఆదేశించారు.
Pending Traffic Challans | చలాన్లు కట్టకపోతే ..
పెండింగ్ ఫైన్లు క్లియర్ చేసే వరకు సదరు వాహనాలకు సంబంధించిన పలు రకాల ఆన్లైన్ సేవలను నిలిపివేయనున్నారు. వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) రెన్యూవల్ చేసుకోవడం కుదరదు. డూప్లికేట్ ఆర్సీ ఇవ్వరు, అడ్రస్ మార్చడం కూడా సాధ్యం కాదు. ఫిట్నెస్ సర్టిఫికేట్‌ను నిరాకరించడంతో పాటు, పరివాహన్ పోర్టల్‌లో ఆ వాహనాన్ని బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు. వాహనం ఓనర్ షిప్ మార్చాలన్నా (వేరే వారికి అమ్మాలన్నా) కుదరదు. ముఖ్యంగా, పెండింగ్ చలాన్లు ఉన్న బండ్లకు పొల్యూషన్ (PUC) సర్టిఫికేట్ కూడా జారీ చేయరు. అంతేకాకుండా, పదే పదే నిబంధనలు ఉల్లంఘించే డ్రైవర్ల లైసెన్స్ రెన్యూవల్‌ను నిలిపివేయడంతో పాటు, ప్రస్తుతం ఉన్న లైసెన్సులను కూడా సస్పెండ్ చేయాలని కోర్టు పేర్కొంది.
2012లో దాఖలైన ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. ఇన్ని సంవత్సరాలుగా తాము ఇస్తున్న ఆదేశాలు కేవలం కాగితాలకే పరిమితమైతే సహించేది లేదని హెచ్చరించింది. కాబట్టి రోడ్డుపైకి వెళ్లేటప్పుడు నిబంధనలు కచ్చితంగా పాటించడంతో పాటు, మీ వాహనంపై ఏవైనా పెండింగ్ చలాన్లు ఉంటే వెంటనే క్లియర్ చేసుకోవడం చాలా మంచిది.
ఇది కూడా చదవండి: Red Cross Nizamabad | రెడ్‌క్రాస్ ద్వారా సేవచేసే అవకాశమివ్వండి..