అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kuwait Legal Issue | కువైట్‌లో న్యాయపరమైన సమస్యల కారణంగా ఏళ్లుగా స్వదేశానికి తిరిగి రాలేకపోతున్న తిరుమల వెంకట రమణను భారత్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)ని కలిశారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో వెంకట రమణ కుటుంబ పరిస్థితులను వివరిస్తూ కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు.
Kuwait Legal Issue | సమస్యను వివరించిన భాను ప్రకాష్‌రెడ్డి..
వెంకట రమణ కువైట్‌లో ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలు, ఆయన స్వదేశానికి తిరిగి రావడంలో ఎదురవుతున్న ఇబ్బందులను భాను ప్రకాష్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంలో కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి, వెంకట రమణను స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన సహకారం అందించాలని కోరారు.
ఏళ్లుగా ఆయన రాక కోసం భార్య, ముగ్గురు కుమార్తెలు ఎదురుచూస్తున్నారని భాను ప్రకాష్ రెడ్డి వివరించారు. కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న పరిస్థితులను కేంద్ర మంత్రికి తెలియజేసి, వెంకట రమణ తన కుటుంబంతో తిరిగి కలిసేలా అవసరమైన సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.
Kuwait Legal Issue | కిషన్‌రెడ్డి హామీ..
కుటుంబ పరిస్థితిని పరిశీలించిన కిషన్ రెడ్డి.. సంబంధిత అధికారులతో మాట్లాడి, సాధ్యమైన మేరకు సహాయం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.
తమ కుటుంబ సభ్యుడిని స్వదేశానికి తీసుకురావడానికి భాను ప్రకాష్ రెడ్డి చొరవ చూపడంపై వెంకట రమణ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఏళ్లుగా కొనసాగుతున్న వియోగానికి ముగింపు పలికి వెంకట రమణ కుటుంబంతో తిరిగి కలవాలని వారు ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి..: Voter Registration | ఓటర్ల నమోదుకు స్పెషల్ డ్రైవ్.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం