Ponguleti Land Survey | రైతులకు ఆందోళన వద్దు.. అసైన్డ్ భూములను లాక్కోం: మంత్రి పొంగులేటి

అసైన్డ్ భూముల పట్టాలు ఉన్నవారిని ఎలాంటి ఇబ్బంది పెట్టబోమని, ప్రభుత్వ పట్టాలు ఉన్నవారి భూములను లాక్కునే ప్రసక్తి లేదని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ponguleti Land Survey | అసైన్డ్ భూముల పట్టాలు ఉన్నవారిని ఎలాంటి ఇబ్బంది పెట్టబోమని, ప్రభుత్వ పట్టాలు ఉన్నవారి భూములను లాక్కునే ప్రసక్తి లేదని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన ఇన్‌ఫార్మల్ చిట్‌చాట్‌లో ఆయన భూముల సర్వే, కేసీఆర్, హరీష్‌రావుల ఆస్తులపై పలు కీలక విషయాలను వెల్లడించారు.

Ponguleti Land Survey | అసైన్డ్ భూములపై క్లారిటీ..

ప్రస్తుతం భూముల ఓవర్ ల్యాపింగ్‌ను వెలికితీసే ప్రక్రియ మాత్రమే జరుగుతోందని మంత్రి తెలిపారు. ఒక వ్యక్తి నివసించే భూమి ఎంత, డాక్యుమెంట్లలో ఉన్నది ఎంత, ఫిజికల్ పొజిషన్‌లో ఎంత ఉందనేది స్పష్టత రావాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూముల లెక్క తేల్చిన తర్వాతే పక్కనున్న భూముల యజమానులకు నోటీసులు ఇస్తామని చెప్పారు. ప్రతిపక్షాలు రైతులను అనవసరంగా రెచ్చగొడుతున్నాయని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు. అధికారులు తప్పులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Ponguleti Land Survey | కేసీఆర్, హరీష్ రావులపై విమర్శలు..

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొంగులేటి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ చిన్నప్పుడే రెండు ఎకరాల్లో ఇల్లు ఉండేదని చెబుతున్నారని, మరి కేసీఆర్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆ వివరాలు అఫిడవిట్‌లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అసైన్డ్ ల్యాండ్ ఉండాల్సినంత అక్కడ లేదని, అది కేసీఆర్ కబ్జాలోనే ఉందనే సమాచారంతోనే సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఈటెల రాజేందర్ ఫామ్‌హౌస్ వివాదం లాగే, ఇప్పుడు కేసీఆర్ ఫామ్‌హౌస్ విషయంలోనూ విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు.

హరీష్ రావు  ( Harish Rao )ఆస్తుల వివాదంపై మాట్లాడుతూ.. అఫిడవిట్‌లో చూపించిన 13 ఎకరాలు ఎక్కడివని నిలదీశారు. నూనుగు మీసాల వయస్సు ఉన్నప్పుడే హరీష్ రావుకు 42 ఎకరాల భారీ భూమి ఎలా వచ్చిందని, తాత గిఫ్ట్ ఇచ్చారనడానికి అంత పెద్ద గిఫ్ట్‌లు ఇవ్వడం వారి కుటుంబానికే చెల్లుతుందని ఎద్దేవా చేశారు. రంగనాయక సాగర్ భూముల విషయంలో హరీష్ రావు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉంటూ, ఆ భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, కేవలం రూ. 2.20 లక్షలు మాత్రమే చెల్లించి ఆ భూమిని సొంతం చేసుకున్నారని విమర్శించారు. రైతుల నుంచి తక్కువ ధరకు కొని, గుట్ట చుట్టూ కోట్లు పెట్టి రోడ్లు వేసుకున్నారని ఆరోపించారు.

తాము లేదా ముఖ్యమంత్రి ఏది మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతామని, తప్పు ఎవరు చేసినా తప్పేనని, చివరికి తాను తప్పు చేసినా తప్పేనని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అలాగే ఎల్బీ నగర్‌లోని 118 జీవో సమస్యలపై త్వరలోనే కమిటీ వేయనున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి:  Indian Stock Market | లాభాల్లో ప్రధాన సూచీలు..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *