అక్షరటుడే వెబ్డెస్క్: Ponguleti Srinivasa Reddy | రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తూ, సంక్షేమ ఫలాలను వారికి చేరవేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మణుగూరు ( Manuguru )మండలం గుట్ట మల్లారం గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Ponguleti Srinivasa Reddy | అభివృద్ధి – సంక్షేమం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమాన ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే గుట్ట మల్లారం గ్రామంలో రూ.1 కోటి వ్యయంతో బీటీ రోడ్డు, రూ.2.35 కోట్లతో హై లెవల్ వంతెన పనులకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. ఈ పనులు పూర్తయితే స్థానిక ప్రజల రవాణా కష్టాలు తీరుతాయని ఆయన పేర్కొన్నారు.
Ponguleti Srinivasa Reddy | ప్రజా సంక్షేమ పథకాల భరోసా..
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ మంత్రి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రతి ఇంటికి నాణ్యమైన సన్నబియ్యం పంపిణీతో పాటు, అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. మహిళా సంఘాలకు రూ.63 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని, మహిళల ప్రయాణ సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించామని వివరించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ, నిర్మాణ పురోగతి ఆధారంగా పారదర్శకంగా బిల్లులను వారం వారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు.
Ponguleti Srinivasa Reddy | ప్రతిపక్షాలపై మంత్రి విమర్శలు..
గత బీఆర్ఎస్ పాలనపై మంత్రి పొంగులేటి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకే పరిమితమై, పేదల గృహనిర్మాణాన్ని విస్మరించిందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్న ఫలాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నాయని, వాటిని ప్రజలు ఏమాత్రం నమ్మడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Armoor Political Heat | కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. పోటాపోటీ సవాళ్లతో ఆర్మూర్లో పొలిటికల్ హీట్