Poshan Awareness Programs | పోషణకు అభయం.. అంగన్‌వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పోషకాహారం కీలకమని అధికారులు పేర్కొంటున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Poshan Awareness Programs | ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పోషకాహారం కీలకమని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు సమతుల్య ఆహారం అందించడం ద్వారా రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలను నివారించవచ్చని సూచిస్తున్నారు. ఈ లక్ష్యంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘పోషణ మాసోత్సవాలు’ నిర్వహిస్తున్నారు.

Poshan Awareness Programs | జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల వివరాలు..

కామారెడ్డి జిల్లా (Kamareddy District)లో 1,195 అంగన్​వాడీ కేంద్రాలు ఉండగా గర్భిణులు 6,578 మంది ఉన్నారు. బాలింతలు 5,610మంది అలాగే ఆరేళ్లలోపు చిన్నారులు 65,780మంది ఉన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో 1,501 అంగన్​వాడీలు ఉండగా.. గర్భిణులు 9,621మంది ఉండగా.. బాలింతలు 6,428 మంది, ఆరేళ్లలోపు చిన్నారులు 50,496 ఉన్నారు. ఈ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంతో పాటు ఆరోగ్యం, పరిశుభ్రత, టీకాలు, ప్రాథమిక విద్యపై అవగాహన కల్పిస్తున్నారు.

Poshan Awareness Programs | పోషకాహారంపై విస్తృత అవగాహన

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పోషకాహార పదార్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. గుడ్లు, బాలామృతం, పోషకాహార పప్పులు తదితరాలను అందిస్తూ వాటి వినియోగం, ప్రయోజనాలను వివరిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అవగాహన లేకపోవడం వల్ల సమతుల్య ఆహారానికి దూరమయ్యే కుటుంబాలకు ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

Poshan Awareness Programs | తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

గర్భధారణ సమయంలో తల్లి తీసుకునే ఆహారం పుట్టబోయే శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందువల్ల గర్భిణులు తప్పనిసరిగా పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని, రక్తహీనతను నివారించేందుకు వైద్యుల సూచనల మేరకు ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ వంటి పోషకాలను తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. బాలింతలు, చిన్నారులకు కూడా వయసుకు తగిన పోషకాహారం అందించాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు.

Poshan Awareness Programs | రోజుకో కార్యక్రమంతో చైతన్యం..

పోషణ మాసోత్సవాల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. అవగాహన ర్యాలీలు, పోషణ ప్రతిజ్ఞ, సదస్సులు, పోషణ ముగ్గులు, రక్తహీనతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తూ పోషకాహార ప్రాధాన్యతను వివరించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించేలా చర్యలు చేపడుతున్నారు. కిశోర బాలికల్లో రక్తహీనత సమస్యను తగ్గించేందుకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, పండ్లు తదితరాలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

Poshan Awareness Programs | పోషక వంటకాలపై అవగాహన

స్థానికంగా లభించే పదార్థాలతో సులభంగా తయారు చేసుకోగల పోషక విలువలున్న వంటకాలపై అంగన్‌వాడీ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువలు అందించే ఆహార పదార్థాలను గుర్తించి, వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకునే విధానాన్ని వివరిస్తున్నారు.  పోషకాహారంతో పాటు పరిశుభ్రతకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. భోజనం ముందు, మరుగుదొడ్డి వినియోగం తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, తాగునీటిని పరిశుభ్రంగా ఉంచడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి అంశాలపై గ్రామాల్లో చైతన్యం కల్పిస్తున్నారు.

Poshan Awareness Programs | ప్రజలు భాగస్వాములు కావాలి

పోషణ మాసోత్సవాలను కేవలం అంగన్‌వాడీ కేంద్రాలకే పరిమితం చేయకుండా గ్రామస్థులు, మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని అధికారులు సూచిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాలకు ప్రజలు హాజరై పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Kisan Morcha Cycle Yatra | రైతు హామీల అమలు కోసం కిసాన్ మోర్చా సైకిల్ యాత్ర..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *