అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pradeep Rawat Death | భారతీయ సినీ పరిశ్రమలో తనదైన విలనిజంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన మంగళవారం సాయంత్రం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త సినీ పరిశ్రమను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
Pradeep Rawat Death | హిందీ చిత్రాలతో ప్రయాణం..
1952 జనవరి 21న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించిన ప్రదీప్ రావత్.. హిందీ చిత్రాలతో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, భోజ్‌పురి, నేపాలీ తదితర భాషల్లో విభిన్న పాత్రలు పోషించి బహుభాషా నటుడిగా ప్రత్యేక స్థానం సంపాదించారు.
Pradeep Rawat Death | సై తో ఉత్తమ ప్రతినాయకుడిగా..
తెలుగు ప్రేక్షకులకు ఆయన పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది ‘సై’ సినిమాలో పోషించిన ‘బిక్షూ యాదవ్’ పాత్రే. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఆ చిత్రంలో ఆయన చూపించిన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ పాత్రకు గాను ఉత్తమ ప్రతినాయకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు.
NTR Dragon Shoot | నాన్‌స్టాప్‌గా డ్రాగన్ షూటింగ్.. కోలుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్
ఆ తర్వాత ‘ఛత్రపతి’లో రాజ్ బిహారి, ‘భద్ర’, ‘దేశముదురు’, ‘స్టాలిన్’, ‘ఓయ్’, ‘నేను శైలజ’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలతో తన నటనా వైవిధ్యాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా విలన్ పాత్రల్లో ఆయన ప్రదర్శించిన గంభీరమైన హావభావాలు, ప్రత్యేక శైలి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అవసరానికి తగ్గట్టుగా హాస్యభరిత పాత్రల్లోనూ మెప్పించి నటుడిగా తన బహుముఖ ప్రజ్ఞను నిరూపించారు.
Pradeep Rawat Death | గజినీతో దేశవ్యాప్త గుర్తింపు..
హిందీలో ‘గజిని’ చిత్రంలోని ప్రతినాయక పాత్ర ఆయనకు దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ఆ సినిమా విజయంతో భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న విలన్‌లలో ఒకరిగా ఎదిగారు.
దశాబ్దాలపాటు వెండితెరపై తనదైన ముద్ర వేసిన ప్రదీప్ రావత్, చివరిసారిగా తెలుగులో ‘గాయపడ్డ సింహం’ చిత్రంలో కనిపించారు. తన గంభీరమైన స్వరం, హావభావాలు, ప్రభావవంతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటుగా సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
ప్రదీప్ రావత్ మృతికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు.