అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Railway Bridge Traffic Diversion | నగరంలో(Nizamabad) రైల్వే కమాన్ వద్ద వంతెన ట్రాఫిక్ డైవర్షన్ పనులు దీపావళి వరకు వాయిదా వేయాలని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా (Bigala Ganesh guptha) డిమాండ్ చేశారు. కమాన్ ప్రాంతాన్ని ఆదివారం సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
Railway Bridge Traffic Diversion | నగర ప్రజలకు ఇబ్బందులు..
బతుకమ్మ, దసరా పండుగల వేళ నగరంలోని విజయ్ టాకీస్ పక్కన ఉన్న రైల్వే బ్రిడ్జి విస్తరణ పనులు ప్రారంభిస్తే నగరవాసులకు ఇబ్బందులు తలెత్తుతాయని బిగాల పేర్కొన్నారు. దసరా పండుగకు కేవలం మూడు రోజుల ముందు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. దసరా పండుగ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో నిజామాబాద్‌కు వచ్చి పండుగ కొనుగోళ్లు చేస్తుంటారని తెలిపారు. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో కొత్తగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం సరైంది కాదన్నారు.
Railway Bridge Traffic Diversion | చిరు వ్యాపారులు..
ట్రాఫిక్ డైవర్షన్ కారణంగా వ్యాపారులు, చిరు వ్యాపారులు, వాహనదారులు, పండుగ కొనుగోళ్ల కోసం వచ్చే కుటుంబాలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందన్నారు. పండుగల సమయంలో ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని.. కానీ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని గణేష్ బిగాల స్పష్టం చేశారు. పోలీసు, రైల్వే శాఖ అధికారులు సమన్వయంతో చర్చించి, దసరా, దీపావళి పండుగలు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ డైవర్షన్‌ను వాయిదా వేయడంతో పాటు, బ్రిడ్జి విస్తరణ పనుల విషయంలో తగిన ప్రణాళిక రూపొందించాలని కోరారు.
ఇది కూడా చదవండి: అమెరికాలో ఫాస్ట్ రోప్ ప్రదర్శనలో ప్రమాదం..