అక్షరటుడే, వెబ్‌డెస్క్: RBI Loan Recovery Rules | ఈఎంఐ చెల్లింపులు చేయని వ్యక్తులను వేధించకుండా చూసేందుకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. బ్యాంకులు, రుణదాతలు రుణగ్రహీతలను ఎలా సంప్రదించాలి, వసూలు ఏజెంట్లు ఏమి మాట్లాడాలి, ఎప్పుడు కాల్ చేయాలి, క్షేత్రస్థాయి పర్యటనలు ఎలా నిర్వహించాలి అనే విషయాలపై కఠినమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు జనవరి 1, 2027 నుండి అమల్లోకి వస్తాయి.
బ్యాంకులు, వసూలు ఏజెంట్లు సాధారణంగా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే రుణగ్రహీతలను సంప్రదించాలి. ఈ సమయాలకు వెలుపల కాల్స్ లేదా పర్యటనలు, రుణగ్రహీత ప్రత్యేకంగా అభ్యర్థించినా లేదా అధికారం ఇచ్చినా మాత్రమే అనుమతించబడతాయి. ఆత్మీయుల మరణం, వైద్య అత్యవసర పరిస్థితి లేదా వివాహ వేడుక వంటి సున్నితమైన పరిస్థితులలో లోన్ తీసుకున్న వారిని వేధించొద్దు. బెదిరింపు, దూషణ, భయపెట్టే భాషను ఉపయోగించడాన్ని కూడా ఆర్‌బిఐ నిషేధించింది. ఏజెంట్లు బెదిరింపు కాల్స్ చేయడం, రుణగ్రహీతలను పదేపదే సంప్రదించడం, వారిని బహిరంగంగా అవమానించడం లేదా వారి కుటుంబం, ఆస్తులు లేదా ప్రతిష్టను బెదిరించడం వంటివి చేయకూడదని స్పష్టం చేసింది.
RBI Loan Recovery Rules | ఇంటికి నేరుగా రావొద్దు
ప్రస్తుతం పలువురు లోన్ రికవరీ ఏజెంట్లు వేధింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు కట్టకపోతే సోషల్ మీడియాలో రుణగ్రహీతకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, తప్పుడు సమాచారం, మార్ఫింగ్ వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఇలాంటివి చేయొద్దని ఆర్‌బీఐ తాజాగా ఆదేశించింది. అలాగే ఏజెంట్లు నేరుగా రుణగ్రహీత ఇంటికి రావొద్దు. వ్యక్తిగతంగా సందర్శించడానికి ముందు, రుణగ్రహీతకు కనీసం ఒక రోజు ముందుగా తెలియజేయాలి. ఏజెంట్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డు, అధికార పత్రం, సంబంధిత నోటీసును కలిగి ఉండాలి.
RBI Loan Recovery Rules | శిక్షణ ఇవ్వాలి
లోన్ రికవరి బాధ్యతను ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చినా.. బ్యాంకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. రికవరీ ఏజెంట్లకు సరైన శిక్షణ ఇవ్వాలని, బ్యాంకులు తమ ప్రోత్సాహక నిర్మాణాలు దూకుడు రికవరీ వ్యూహాలను ప్రోత్సహించకుండా చూసుకోవాలని కూడా ఆర్‌బీఐ పేర్కొంది. బకాయిలను వసూలు చేయడానికి రికవరీ ఏజెంట్లకు అవసరమైన సమాచారం మాత్రమే అందాలి. రుణగ్రహీతల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి భద్రతా చర్యలు చేపట్టాలని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది. ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్ వంటి వస్తులు ఈఎంఐలో తీసుకొని డబ్బు చెల్లించకపోతే రుణదాత వాటిని లాక్ చేయొచ్చని ఆర్‌బీఐ తెలిపింది. అయితే రుణ చెల్లించకుండా 30 రోజుల తర్వాతే నియంత్రణలు ప్రారంభించవచ్చు. ఖాతా 60 రోజులు బకాయి ఉన్న తర్వాత మాత్రమే పరికరంపై పూర్తి నియంత్రణ విధించవచ్చు. ఒకవేళ డబ్బులు చెల్లిస్తే గంటలోపు ఆ పరికరాన్ని పునరుద్ధరించాలి.
ఇది కూడా చదవండి..: Abhijit Dipke | మోహన్ భగవత్ వ్యాఖ్యలపై స్పందించిన అభిజిత్ దీప్కే