అక్షరటుడే వెబ్‌డెస్క్: RBI Money Transfer Rules | దేశీయంగా జరిగే మనీ ట్రాన్స్‌ఫర్ లావాదేవీలను మరింత సురక్షితంగా, పారదర్శకంగా మార్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. కస్టమర్లకు రక్షణ కల్పించడం, గుర్తింపును సరిగ్గా ధృవీకరించడం, ఆర్థిక మోసాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. నగదు బదిలీ చేసే వారందరికీ ఉపయోగపడే కీలక నిబంధనలు ఇక్కడ ఉన్నాయి.
RBI Money Transfer Rules | ఏటీఎం బదిలీ పరిమితులు..
డబ్బు అందుకునే వ్యక్తికి బ్యాంక్ ఖాతా ఉండి, పంపే వారికి ఖాతా లేకపోతే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి నెఫ్ట్ (NEFT) ద్వారా నగదు బదిలీ చేయవచ్చు. ఇలా ఒక్కో లావాదేవీలో గరిష్టంగా రూ.50 వేల వరకు పంపే అవకాశం ఉంది. బ్యాంకింగ్ కరస్పాండెంట్ (BC) పాయింట్లు, ఏటీఎంల ద్వారా జరిపే బదిలీలలో ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.5 వేల వరకు పరిమితి విధించారు. బ్యాంక్ ఖాతా లేని వారికి కూడా నిధులు పంపే వెసులుబాటు ఉంది.
RBI Money Transfer Rules | బీసీల ద్వారా నగదు బదిలీ..
బ్యాంక్ అకౌంట్ లేని వ్యక్తులకు బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా డబ్బులు అందించవచ్చు. ఇందుకోసం డబ్బు పంపే వ్యక్తి బీసీకి నగదు ఇస్తే, ఆ కరస్పాండెంట్ డబ్బు అందుకునే వారికి నగదు రూపంలో అందజేస్తారు. ఈ విధానంలో ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.10 వేల వరకు పంపవచ్చు. నెలవారీ పరిమితి రూ.25 వేలుగా నిర్ణయించారు.
RBI Money Transfer Rules | ధృవీకరణ తప్పనిసరి..
నకిలీ గుర్తింపులను అడ్డుకుని, డబ్బు ఎవరు పంపుతున్నారో స్పష్టంగా నిర్ధారించేందుకు నిబంధనలను కఠినతరం చేశారు. డబ్బు పంపేవారు తమ ధృవీకరించబడిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయడంతో పాటు చెల్లుబాటు అయ్యే కేవైసీ ( KYC ) పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి లావాదేవీకి ఓటీపీ (OTP) ధృవీకరణను తప్పనిసరి చేశారు.
RBI Money Transfer Rules | సేవా ఛార్జీలపై స్పష్టత..
ఈ మనీ ట్రాన్స్‌ఫర్ సేవలను తప్పనిసరిగా ఉచితంగా అందించాలని ఆర్బీఐ ఎలాంటి నిబంధన విధించలేదు. లావాదేవీలకు బ్యాంకులు లేదా సంబంధిత సంస్థలు సేవా ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. అందువల్ల డబ్బు పంపే ముందు వర్తించే ఛార్జీల వివరాలను ముందుగానే తెలుసుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి: Land Auction | అరెస్టులతో ప్రజల గొంతును నొక్కలేరు : కేటీఆర్