Rice Millers Protest | రైస్ మిల్లుల ఫిజికల్ వెరిఫికేషన్ ఆపాలి

రైస్ మిల్లులపై ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి:  Rice Millers Protest | రైస్ మిల్లులపై ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎంఆర్ బియ్యం అప్పగించేందుకు డిసెంబర్ 31 వరకు గడువు ఇవ్వాలని కోరారు. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు.

 Rice Millers Protest | 1960 నుంచి రైస్​మిల్లులు ఉన్నాయ్​..

1960 నుంచి రైస్ మిల్లు పరిశ్రమ ఉందని, 2014కు ముందు ప్రభుత్వానికి కావాల్సిన బియ్యాన్ని మిల్లుల్లోనే కొనుగోలు చేసేవారని గుర్తు చేశారు. పుణ్యానికి ధాన్యం ఇస్తే పందికొక్కుల్లా వ్యవహరిస్తున్నారని కొందరు మాట్లాడటం సరికాదన్నారు. ధాన్యం పేరుతో ఇష్టారాజ్యంగా దాడులు చేస్తూ వేరిఫికేషన్ పేరుతో మిల్లర్లను జైలులో పెడితే సహించేది లేదని హెచ్చరించారు. 2020 నుంచి కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం మిల్లులలో 74 హెచ్​పీ ఉన్న బిల్లులను 350 నుంచి 400 హెచ్​పీ వరకు బిల్లులు పెరిగేలా మిషన్లు, కంప్రెషర్లు వేయించి ఆర్థిక భారం పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో 75 లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డి (Kamareddy) జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు సీఎంఆర్ చెల్లించాల్సి ఉందని, ఫిజికల్ వెరిఫికేషన్ పేరిట ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు. 2014 నుంచి 2024 వరకు 9.70 కోట్ల ధాన్యం మిల్లర్లకు అప్పగిస్తే 9.60 కోట్ల బియ్యం అప్పగించామని, కేవలం 2 శాతం బకాయి కోసం 98 శాతం మందిని వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. క్వింటాలుకు 67 కిలోల బియ్యం రాదని చెప్పినా వినడం లేదని, 67 కిలోల అంశంపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని, 67 కిలోలు వస్తుందని నిరూపిస్తే రైస్ మిల్లర్లందరం తప్పయిందని ఒప్పుకుంటామని సవాల్ చేశారు.

 Rice Millers Protest | పరిశ్రమలు మూతపడే పరిస్థితి..

గతంలో జిల్లాలో 36 షుగర్​ ఫ్యాక్టరీలు ఉండేవని, ఆ ఫ్యాక్టరీలు ఆర్థికంగా దెబ్బతిని మూతపడ్డాక రైతులు చెరకు పండించడం తగ్గించారని, ఫలితంగా చెరకు విస్తీర్ణం తగ్గి చక్కెర ధరలు అమాంతం పెరిగాయని గుర్తు చేశారు. అదే తరహాలో మిల్లర్లను ఇబ్బందులు పెడితే ఈ పరిశ్రమలు కూడా మూతపడితే రైతు వరికి బదులు కూరగాయలు పండించి బతకాల్సి వస్తుందని, అప్పుడు బియ్యం ధరలు అమాంతం పెరుగుతాయని హెచ్చరించారు. ఒక్క ఎల్ నినో వస్తేనే తట్టుకోలేకపోయారని, దేశంలో మూడు నాలుగేళ్లు పంటలు పండక కరువు వస్తే ప్రపంచంలో ఏ దేశానికైనా అన్నం పెట్టే స్థితిలో ఉన్న భారతదేశానికి ఏ దేశం అన్నం పెడుతుందని ప్రశ్నించారు. రూ.40-50 కోట్లు ముంచిన సంఘ విద్రోహక శక్తులను సంఘం నుంచి ఏరివేసి వారి నుంచి రికవరీ చేయాలని, దానికి తాము మద్దతిస్తామన్నారు.

అసెంబ్లీ సెషన్స్ ముగిశాక తమతో చర్చలు జరపాలని, డిసెంబర్ 31 వరకు గడువు ఇవ్వాలని, ప్రభుత్వానికి బియ్యం అప్పగించిన తర్వాత వచ్చే పంట తమకు ఇవ్వాలన్నారు. ఈ ధర్నాలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, జిల్లా కార్యదర్శి సంతోష్, కోశాధికారి ముత్యపు సుదర్శన్, మాజీ అధ్యక్షుడు కంచర్ల లింగం, మాజీ కార్యదర్శి గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Ankapur Model Market | అంకాపూర్​లో మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయాలి..: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *