Salem Fraud Scam | తమిళనాడులో విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. గుండు కొట్టించుకుంటే రూ.15 వేలు అంటూ పథకాల పేరుతో టోకరా

ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు కొత్త రకం మోసాలకు తెరలేపుతున్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Salem Fraud Scam | ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు కొత్త రకం మోసాలకు తెరలేపుతున్నారు. అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని, ఫోన్ కాల్స్ ద్వారా మభ్యపెడుతూ వారిని బురిడీ కొట్టిస్తున్నారు. అచ్చం సినిమాల్లో లాగే జరిగిన ఓ వింత సంఘటన తాజాగా తమిళనాడులోని సేలంలో వెలుగుచూసింది.

Salem Fraud Scam |  సినిమా సీన్ రిపీట్..

రవితేజ నటించిన ‘విక్రమార్కుడు’ సినిమాలో అత్తిలి సత్తిబాబు పాత్ర మహిళలను మాయమాటలతో నమ్మించి గుండు కొట్టించే సీన్ అందరికీ గుర్తే ఉంటుంది. సరిగ్గా అలాంటి ఘటనే ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ జరిగింది. మోసగాళ్ల వలలో పడిన ముగ్గురు వృద్ధ మహిళలు ఏకంగా తమ జుట్టును కోల్పోయి, చివరకు మోసపోయామని గ్రహించి లబోదిబోమన్నారు.

Salem Fraud Scam | అసలేం జరిగిందంటే..

సేలం జిల్లా పుదుక్కోత్తంపాడు గ్రామానికి చెందిన ఓ మహిళకు కొన్ని రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తాను అత్తూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని, కరోనా లాంటి కొత్త వ్యాధి ఒకటి జుట్టు ద్వారా వేగంగా వ్యాపిస్తోందని భయపెట్టాడు. దాని బారిన పడకుండా ఉండాలంటే వెంటనే గుండు కొట్టించుకోవడమే ఏకైక మార్గమని నమ్మించాడు. దీనికోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని కూడా తీసుకువచ్చిందని చెప్పాడు. గుండు చేయించుకున్న మహిళల ఖాతాల్లో వెంటనే రూ.15 వేలు జమ చేస్తామని ఆశ చూపాడు. అలాగే, కాలేజీ విద్యార్థినులకైతే రూ.45 వేలు, పురుషులకు రూ.6 వేలు చొప్పున ఇస్తారని మాయమాటలు చెప్పాడు. వారు నమ్మడం కోసం కట్టల కొద్దీ ఉన్న రూ.500 నోట్ల ఫోటోలను సైతం వాట్సాప్‌లో పంపించాడు.

Salem Fraud Scam | గుండు కొట్టించుకున్న మహిళలు..

ఫోన్ చేసిన వ్యక్తి మాటలను నిజమని నమ్మిన ఆ మహిళ.. వెంటనే తన ఇరుగుపొరుగున ఉన్న చిత్ర, రామాయి, కావేరి అనే మరో ముగ్గురు వృద్ధురాళ్లకు (60 ఏళ్లు పైబడిన వారు) ఈ విషయం చెప్పింది. దీంతో డబ్బుల ఆశతో వారంతా స్థానిక సెలూన్‌కు వెళ్లి గుండు గీయించుకున్నారు. ఆ తర్వాత డబ్బుల కోసం ఫోన్ చేయగా.. అవతలి వ్యక్తి మొబైల్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది.

దీంతో అనుమానం వచ్చిన బాధిత మహిళలు వెంటనే అత్తూరు తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లి ఆరా తీశారు. ప్రభుత్వం నుంచి అలాంటి పథకం ఏదీ లేదని అధికారులు స్పష్టం చేయడంతో తాము మోసపోయామని గ్రహించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించి అనుమానితుడైన ఒక యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Pooja Precision IPO | ఊరిస్తున్న ఎస్ఎంఈ ఐపీవో.. తొలిరోజే 90 శాతం లాభాలు వచ్చే అవకాశం!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *