Sana Satish Babu | ఉమ్మడి తూర్పుగోదావరిలో సానా మార్క్.. కూటమి క్లీన్ స్వీప్‌కు సాన పెట్టిన సతీష్ బాబు

రాజకీయాల్లో క్లిష్టమైన వ్యూహాలు రచించడం ఎంత ముఖ్యమో.. విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలవడం కూడా అంతే ప్రాధాన్యం కలిగిన అంశం.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Sana Satish Babu | రాజకీయాల్లో క్లిష్టమైన వ్యూహాలు రచించడం ఎంత ముఖ్యమో.. విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలవడం కూడా అంతే ప్రాధాన్యం కలిగిన అంశం. ఈ రెండింటినీ సమర్థవంతంగా మేళవిస్తూ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో తనదైన ప్రత్యేక శైలితో దూసుకెళ్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘనవిజయానికి ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించిన ఆయన, ఆర్నబ్ , మురుసు తుపానుల సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు కొండంత అండగా నిలిచారు.

Sana Satish Babu | పటిష్టమైన సమన్వయం..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూటమికి ఉన్న విభిన్న బలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో సానా సతీష్ బాబు కీలక పాత్ర పోషించారు. స్థానిక నాయకుల మధ్య అభిప్రాయభేదాలను తొలగించి, మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ సజావుగా జరిగేలా ప్రణాళికలు రచించారు. అమలాపురం, రామచంద్రపురం, ముమ్మిడివరం ప్రాంతాల కూటమి నేతలతో పాటు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగితో కలిసి వ్యూహాలు అమలు చేశారు. స్థానిక గెలుపు గుర్రాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికకు ప్రాధాన్యమిస్తూ అభ్యర్థుల విజయానికి శ్రేణులు ప్రాణప్రదంగా పనిచేసేలా పిలుపునిచ్చారు.

Sana Satish Babu | రికార్డు విజయం..

అమలాపురం, రామచంద్రపురం, ముమ్మిడివరంలో ఎంపీ సతీష్ బాబు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బైక్ ర్యాలీలు, గడప గడపకూ ప్రచారంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఈ కృషి ఫలితంగా అమలాపురం మున్సిపాలిటీలోని 36 వార్డులకు గాను కూటమి 30 స్థానాలు సాధించగా, ఛైర్మన్ అభ్యర్థి నల్లా శ్రీధర్ 11,979 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. రామచంద్రపురంలో కూటమి 27 స్థానాలను కైవసం చేసుకోగా, మేడిశెట్టి శేషారావు 7,840 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే ముమ్మిడివరం నగర పంచాయతీలో 23 వార్డుల్లో కూటమి 18 స్థానాలు దక్కించుకోగా, గుబ్బల గంగారత్న భవాని 2,299 ఓట్ల మెజారిటీతో ఛైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకున్నారు.

Sana Satish Babu | క్షేత్రస్థాయి పర్యటనలు..

ఎన్నికల సమయమనే తేడా లేకుండా ఆర్నబ్, మురుసు తుపానులు జిల్లాను వణికించిన వేళ ఎంపీ సతీష్ బాబు తెల్లవారుజామునే బాధితుల వద్దకు పరుగెత్తారు. అల్లవరం, గోపాయిలంక, గోడి, బెండమూరిలంక, ఓడలరేవు, కొమరగిరిపట్నం, నక్కా రామేశ్వరం వంటి గ్రామాల్లో పర్యటించారు. ఓడలరేవు వద్ద తుపాను ధాటికి దెబ్బతిన్న దాదాపు 200 బోట్లను పరిశీలించి, మత్స్యకారులను పరామర్శించారు. విద్యుత్, తాగునీరు, రహదారుల పునరుద్ధరణ పనులను దగ్గరుండి పర్యవేక్షించడమే కాకుండా రహదారులపై కూలిన చెట్లను తొలగించే పనుల్లో స్వయంగా పాల్గొన్నారు.

Sana Satish Babu |చంద్రబాబు దృష్టికి సమస్యలు..

జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ( Nara Chandrababu Naidu )తుపాను ధాటికి దెబ్బతిన్న పంటలు, మత్స్యకారుల బోట్లు , క్షేత్రస్థాయి పరిస్థితులపై స్పష్టమైన నివేదిక అందించారు. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం, పునరావాస చర్యలు వేగవంతం చేయాలని వివరించారు. ఢిల్లీ స్థాయిలో రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే, సొంత జిల్లా ప్రజల ఆపద సమయాల్లో అండగా నిలిచి కూటమి విజయానికి మార్గం సుగమం చేసిన సానా సతీష్ బాబు తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ప్రశంసలు కురిపించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇది కూడా చదవండి: Pawan Kalyan Divorce | విడాకులు తీసుకున్న పవన్​ కల్యాణ్​.. సోషల్​ మీడియాలో తీవ్ర చర్చ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *