అక్షరటుడే, కామారెడ్డి: Fake Certificates | కామారెడ్డి జిల్లా (Kamareddy District) ఫేక్ సర్టిఫికెట్ల తయారీ, ఫోర్జరీ సంతకాల ఘటనలకు నిలయంగా మారుతోంది. ఇక్కడ అన్ని రకాల మోసాలు చేయబడును అని బోర్డులు తగిలించుకునేలా పలువురు నేర ప్రవృత్తిని ఎంచుకుంటున్నారు.
ఒకప్పుడు ఫోర్జరీ అంటే భయం ఉండేది. ఇప్పుడు అదే ఒక వృత్తిగా, కళగా మారిపోయింది. సంతకాలు, సీళ్లు, సర్టిఫికెట్లు అన్నీ అసలువాటికి ఏమాత్రం తేడా లేకుండా తయారు చేస్తున్నారు. కంప్యూటర్, ప్రింటింగ్ టెక్నాలజీని అడ్డం పెట్టుకొని నకిలీలను అసలువాటిలా మార్చేస్తున్నారు. ఏ యూనివర్సిటీ సర్టిఫికెట్ కావాలన్నా, ఏ అధికారి సంతకం కావాలన్నా డబ్బులు ఇస్తే చాలు.. రెడీమేడ్‌గా అందిస్తున్నారన్న ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. దీంతో నకిలీ దందా చేసేవారికి ఇది సులభంగా డబ్బు సంపాదించే మార్గంగా మారింది.
Fake Certificates | జిల్లాలో వెలుగుచూస్తున్న ఘటనలు
గడిచిన నాలుగు నెలల్లోనే వరుసగా ఫోర్జరీ ఘటనలు బయటపడుతున్నాయి. నాలుగు నెలల క్రితం యోగ భవన నిర్మాణానికి సంబంధించి ఎన్ఓసి ఇచ్చినట్టుగా కామారెడ్డి టీపీవో సంతకం ఫోర్జరీ చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ కేసులో పురోగతి ఎక్కడిదాకా వచ్చిందో ఇప్పటికీ వెల్లడించలేదు. నిందితుని వద్ద భారీగా డాక్యుమెంట్లు లభించినా వాటి పురోగతిలో అడుగు కూడా ముందుకు కదలలేదు. ఈ కేసు ఏమైందో తెలియకముందే రెండు నెలల క్రితం మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ యూనివర్సిటీ పేరుతో నకిలీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్ల వ్యవహారం బయటపడింది. ఒక్కో ఘటన వెలుగులోకి వచ్చినప్పుడు హడావుడి చేసి ఆ తర్వాత మరిచిపోవడం పరిపాటిగా మారింది.
Fake Certificates | ప్రభుత్వ పథకాలు.. ఉద్యోగాల్లో మోసాలు
ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందేందుకు నకిలీ పత్రాల వాడకం పెరిగిపోయింది. రెండు నెలల క్రితం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల కోసం ప్రభుత్వ లబ్ధి పొందేందుకు జీజీహెచ్ ఆర్ఎంఓ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటనలో ముగ్గురు అరెస్టయ్యారు. ఆ తర్వాత ఇలా ఫోర్జరీ సంతకాలతో ఎంతమంది లబ్ధి పొందారో లెక్కలు తీయడంలో అధికారులు విఫలమయ్యారు. అదేవిధంగా జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారన్న ఆరోపణలతో ఇటీవల కొందరిని అధికారులు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఒక యూనివర్సిటీ పేరుతో నకిలీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు పొంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న ఘటన వెలుగులోకి రాగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. దాదాపు 50 మందికి ఈ సర్టిఫికెట్లు అమ్మినట్లు ప్రచారం జరుగుతోంది. చదవకుండానే రూ.2-3 లక్షలు చెల్లించి 90 నుంచి 99 శాతం మార్కులతో పట్టాలు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిజమైన అర్హులు, నిజాయితీగా చదివిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.
Fake Certificates | పట్టించుకోని జిల్లా యంత్రాంగం..
ఇన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు వస్తేనే పోలీసులు రంగంలోకి దిగుతుండగా, ముందస్తుగా తనిఖీలు, నిఘా లేకపోవడంతో నకిలీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. పాత కేసుల పురోగతిపై స్పష్టత ఇవ్వకపోవడం, ఫోర్జరీతో ఎంతమంది లబ్ధి పొందారో లెక్క తేల్చకపోవడం యంత్రాంగ నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. యూనివర్సిటీ రికార్డులతో సరిపోల్చి నకిలీలను గుర్తించే వ్యవస్థను పటిష్టం చేయాలని, మోసాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Poker Raids | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పేకాట స్థావరాలపై దాడులు..