Kamareddy Police station | బాధితుడి వైపు న్యాయం కోసం పీఎస్​కు వెళ్తే దాడి చేశారు.. ఆర్గొండ సర్పంచ్​ ఆరోపణ

Shashi kiran Mottala
Kamareddy Police station | బాధితుడి వైపు న్యాయం కోసం పీఎస్​కు వెళ్తే దాడి చేశారు.. ఆర్గొండ సర్పంచ్​ ఆరోపణ..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Police station | కామారెడ్డి పట్టణంలో (Kamareddy) ఆదివారం హైడ్రామా చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలుడిని హత్య చేసిన ఘటనపై బాలుని తండ్రి నుంచి ఫిర్యాదు తీసుకోకుండా వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి హత్య చేసిన తల్లి బంధువుల నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనకు సంబంధించిన ఆర్గొండ (argonda) సర్పంచ్ విక్రమ్ రెడ్డి వివరాలు వెల్లడించారు.

Kamareddy Police station | పీఎస్​ సిబ్బంది దాడి చేశారు

హత్యకు గురైన బాలుడి తండ్రి భాస్కర్ తనకు అన్యాయం జరిగిందని తనను ఆశ్రయిస్తే బాధితుడిని తీసుకుని కామారెడ్డి పోలీస్ స్టేషన్​కు వెళ్లానని ఆర్గొండ సర్పంచ్ విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. బాలుని తండ్రి ఫిర్యాదు తీసుకోకుండా హత్య చేసిన తల్లి తరఫు బంధువుల ఫిర్యాదు ఎలా తీసుకున్నారని, వీలైతే తండ్రి నుంచి కూడా ఫిర్యాదు తీసుకోవాలని ఇన్​స్పెక్టర్​ను కోరారన్నారు. దాంతో అక్కడే సివిల్​లో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు తనపై దాడికి పాల్పడి ఫోన్ లాక్కున్నారన్నాడు. అంతటితో ఆగకుండా బాలుడిని హత్య చేసిన నిందితుల పక్కన కూర్చోబెట్టి తనను అవమానించారని సర్పంచ్ తెలిపారు.

Kamareddy Police station | సర్పంచ్​ అనే విలువ ఇవ్వకుండా..

తాను ఒక సర్పంచ్ అన్న విలువ కూడా ఇవ్వకుండా దాడికి పాల్పడిన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని వారిని సస్పెండ్ చేయాలని విక్రమ్​రెడ్డి డిమాండ్ చేశారు. అయితే ఆర్గొండ సర్పంచ్​, మండల సర్పంచ్​ల ఫోరమ్ అధ్యక్షుడిగా ఉన్న విక్రమ్ రెడ్డికి మద్దతుగా రాజంపేట మండలంలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ (Yellareddy Constituency) సర్పంచులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు సిద్ధమయ్యారు. బాలుని తరపున బంధువులతో కలిసి కామారెడ్డికి సర్పంచులు చేరుకోగా పోలీసు శాఖ, ఇంటలిజెన్స్ విభాగం (Intelligence Department) అప్రమత్తమైంది. సర్పంచులు, బాధితుల కోసం ఎక్కడికక్కడ నిఘా పెట్టారు.

పోలీస్ స్టేషన్​కు రాకుండా అడ్డుకట్ట వేసేలా ప్లాన్ చేయగా ఈ విషయాన్ని తెలుసుకున్న ఓ నాయకుడు సర్పంచులందరినీ తన వద్దకు పిలుచుకుని మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా సరికాదని, నిందితులపై సైతం కేసులు నమోదు అవుతాయని చెప్పడంతో ధర్నా ఆలోచన విరమించుకున్నారు. సదరు అధికారిపై చట్టపరమైన చర్యలకు ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. జిల్లా ఎస్పీ, ఐజీ, డీజీపీలకు నేరుగా ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు సర్పంచులు పేర్కొన్నారు. దాంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కామారెడ్డిలో హైడ్రామా నెలకొంది.

సర్పంచ్ పై దాడి జరగలేదు

– నరహరి, సీఐ

ఆర్గొండ సర్పంచ్ పై దాడి విషయం అబద్ధం. ఒక సర్పంచ్​ను ఎవరైనా కొడతారా.. ఆయనను ఎవరు కొట్టలేదు. ఆయనే పోలీస్ స్టేషన్లో న్యూసెన్స్ చేశారు. అయినా ఆయనకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇచ్చాం.

kamareddy

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *