అక్షరటుడే, వెబ్డెస్క్: Cyclone Murasu | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మురాసు తుపాన్ బీభత్సం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున తుపాన్ తీరం దాటింది. ఆ సమయంలో భారీ గాలులు వీచాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈదురు గాలులకు అనేక చెట్లు నేలకూలాయి.
తుపాన్ ప్రభావంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, 15 జిల్లాల్లో 30,661 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. కృష్ణా, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో అత్యధిక పంట నష్టం నమోదైంది. వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. 15 జిల్లాల్లోని 132 మండలాలను తుపాన్ ప్రభావితం చేసింది.
Cyclone Murasu | సురక్షిత ప్రాంతాలకు తరలింపు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని సహాయక శిబిరాలకు మొత్తం 10,805 మందిని తరలించారు. నిరాశ్రయులైన ప్రజల కోసం అధికారులు 171 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. బాధిత ప్రజలకు సుమారు 14,810 ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. 11 ఎన్‌డీఆర్‌ఎఫ్, 13 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అత్యవసర విద్యుత్ అవసరాల కోసం అధికారులు 613 జనరేటర్లను సిద్ధంగా ఉంచారు.
Cyclone Murasu | చెట్ల తొలగింపు
తుపాన్ ప్రభావంతో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో వందల సంఖ్యలో భారీ వృక్షాలు నేలకూలాయి. రోడ్లపై చెట్లు పడిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆ చెట్లను తొలగించడానికి అత్యవసర బృందాలను మోహరించారు. కూలిపోయిన చెట్లను తొలగించే పనిలో 185 బృందాలు నిమగ్నమయ్యాయి. ఆరోగ్య శాఖ 13 జిల్లాల్లో 725 వైద్య బృందాలను మోహరించింది.
ఇది కూడా చదవండి..: Rapthadu Attack Case | రాప్తాడు నిందితుడి కుడి కాలు తొలగింపు