అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vangalapudi Anitha | డ్రగ్స్ రహిత ఏపీ కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. గంజాయి సాగును సున్నాకు చేర్చడం వల్లే రాష్ట్రంలో నేరాల రేటు 14 శాతం తగ్గిందన్నారు.
హోం మంత్రి అనిత సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘ఈగల్’ టాస్క్‌ఫోర్స్ ద్వారా 1.20 లక్షల కేజీల గంజాయిని ధ్వంసం చేశామని, స్మగ్లర్ల రూ. 24 కోట్ల ఆస్తులను జప్తు చేశామని తెలిపారు. గంజాయి మూలాలను అరికట్టే యత్నం చేస్తున్నామన్నారు. మాదకద్రవ్యాల నుంచి బయట పడాలంటే ప్రజల సహకారం అవసరం అన్నారు. ఈ బాధ్యతను అందరం భుజాలపై వేసుకొని ముందుకు సాగాలని సూచించారు.
Vangalapudi Anitha | 2027 నాటికి అమరావతి నిర్మాణం
అమరావతి (Amaravati) అందరి కలల రాజధాని అని, 2027 నాటికి దీని నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. వైసీపీ నేతలు రౌడీ షీటర్లతో కలిసి అమరావతిలో గందరగోళం సృష్టించి, ఈ ప్రాజెక్టును పక్కదారి పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. పోలీసులు వారించినా వినకుండా రైతులను రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. రౌడీ షీటర్లతో వెళ్లి కావాలని గొడవకు కారణం అయ్యారని ఆరోపించారు. ఇన్ని రోజులు అమరావతి రాజధాని వద్దన్న వారు ఈ రోజు అమరావతి రైతు పరిరక్షణ చేస్తామని వెళ్తాం అంటే ఎవరికైనా కడుపు మండుతుందన్నారు. అందుకే రైతులు దాడి చేశారన్నారు.
Vangalapudi Anitha | బీచ్ షాక్స్‌పై కీలక వ్యాఖ్యలు

బీచ్ షాక్స్ పై హోం మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆలోచన సీఎం చంద్రబాబుదే అన్నారు. దీనిని పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రభుత్వం అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోవా తరహాలో తీర ప్రాంత పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి, స్థానిక ఉపాధిని పెంపొందించడానికి సముద్ర తీరాలలో బీచ్ షాక్స్ (తాత్కాలిక చెక్క, వెదురు కుటీరాలు) ఏర్పాటుకు మార్గదర్శకాలు జారీ చేసింది. విశాఖ పట్నం, సూర్యలంకలో దీనిని మొదట అమలు చేస్తారు. ఇందులో మద్యం అమ్మకాలు చేపడుతారు. ముందు అందరూ బీచ్ షాక్స్‌కి సహకరించాలని హోం మంత్రి కోరారు. పొరపాట్లు ఏమైనా ఉంటే అప్పుడు చెప్పాలన్నారు.
ఇది కూడా చదవండి..: Idupu Kayitham Controversy 1 | ‘ఇడుపు కాయితం’ వివాదం అనవసరం.. సినిమాను సినిమాగానే చూడాలి: సీనియర్ నటుడు నరేశ్