Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

Naresh Chandan
Sridip Success Story

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని చూస్తూ, భవిష్యత్తు కలలను అక్షరాలుగా కాగితంపై రాస్తున్న ఆ పదిహేనేళ్ల బాలుడికి… అదే సమయంలో తన జీవితాన్ని శాశ్వతంగా మార్చేసే విషాదం ఇంటి దగ్గర జరుగుతోందని తెలియదు.

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం చిన్నూరు గ్రామానికి చెందిన శ్రీదీప్‌నకు అది పదో తరగతి మొదటి పరీక్ష. కానీ, అదే రోజు అతని తండ్రి యేసయ్యను మంజీరా నది బలితీసుకుంది.

Sridip Success Story | కన్నీరుగా మారిన అనుబంధం..

పరీక్ష పూర్తి చేసి ఇంటికి చేరే వరకు ఆ చేదు నిజాన్ని అతనికి ఎవరూ చెప్పలేకపోయారు. ఆ విషయం తెలిసిన క్షణం… ఆ బాలుడి ప్రపంచమే ఒక్కసారిగా కూలిపోయింది. తండ్రి అనుబంధం, ఆశలు, ప్రేమ— అన్నీ కన్నీరుగా మారిపోయాయి.

గోపాల్‌పేట్ ఆదర్శ పాఠశాల టీచర్లు, సహచర విద్యార్థులు గ్రామానికి చేరుకొని శ్రీదీప్‌ను హత్తుకున్నారు. “ఇలాంటి సమయంలో ఈ బాలుడు మళ్లీ పరీక్ష రాయగలడా?” అనే ఆందోళన అందరిలో. కానీ శ్రీదీప్ మాత్రం మౌనంగా నిలిచాడు. మాటలు రాలేదు… కానీ మనసులో ఓ నిర్ణయం బలంగా తీసుకున్నాడు.

Sridip Success Story | గుండెల్లో బాధ..

తండ్రి ఫొటో ముందు ఒక్క క్షణం నిలబడి, కన్నీటి చూపుతో నమస్కరించి… మరుసటి రోజు పరీక్ష కేంద్రం వైపు అడుగులు వేశాడు. కళ్లలో నిండిన నీరు, గుండెల్లో భరించలేని బాధ—అయినా చేతిలోని పెన్ను మాత్రం ఆగలేదు. ప్రతి సమాధానంలో తన దుఃఖాన్ని దాచుకుని, ప్రతి పేజీలో తన తండ్రి కలను రాసుకున్నాడు.

రోజులు గడిచాయి… ఫలితాల రోజు వచ్చింది. ఊరంతా ఉత్కంఠ. ఆ క్షణం వచ్చినప్పుడు—600 మార్కులకు గాను 574 మార్కులు సాధించి మండలంలోనే మొదటి స్థానం సాధించాడు శ్రీదీప్. ఆ వార్తతో గ్రామం ఆనందంలో మునిగిపోయింది. టీచర్లు గర్వంతో మురిసిపోయారు.

Sridip Success Story | టాపర్​…

కానీ, ఆ విజయాన్ని పంచుకునేందుకు తండ్రి లేడు. మార్కుల జాబితా చేతిలో పట్టుకుని తండ్రి ఫొటో ముందు నిలబడి… “నాన్నా, నువ్వు చెప్పినట్టే టాపర్‌గా నిలిచాను” అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన ఆ క్షణం… అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్లను తడిపింది.

ఇప్పుడు చిన్నూరు గ్రామంలో శ్రీదీప్ పేరు ఒక ప్రేరణగా మారింది. “కష్టం మనల్ని కూల్చడానికి కాదు, నిలబెట్టడానికి వస్తుంది” అని పెద్దలు పిల్లలకు చెబుతున్నారు. తండ్రి లేకపోవడం ఒక తీరని లోటే… కానీ, ఆ తండ్రి కలను నిజం చేసిన కొడుకు కథ మాత్రం ఎన్నటికీ చెరిగిపోని స్ఫూర్తి.

IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల బదిలీ

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *